కువైత్‌ నుంచి క్వారంటైన్‌కు.. 149 మంది ప్రవాసాంధ్రుల తరలింపు

ABN , First Publish Date - 2020-05-23T18:29:15+05:30 IST

కువైత్‌ నుంచి 149 మంది ప్రవాసాంధ్రులు వివిధ ప్రాంతాల్లోని పెయిడ్‌, ఉచిత క్వారంటైన్లకు చేరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశంలో చిక్కుకున్న వీరిని వందేమాతరం మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.50 గంటల సమయంలో

కువైత్‌ నుంచి క్వారంటైన్‌కు.. 149 మంది ప్రవాసాంధ్రుల తరలింపు

విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన తొలి విమానం 

తిరుపతి నుంచి సొంత జిల్లాలకు చేర్చిన అధికారులు 


తిరుపతి(చిత్తూరు): కువైత్‌ నుంచి 149 మంది ప్రవాసాంధ్రులు వివిధ ప్రాంతాల్లోని పెయిడ్‌, ఉచిత క్వారంటైన్లకు చేరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశంలో చిక్కుకున్న వీరిని వందేమాతరం మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.50 గంటల సమయంలో ఈ విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరింది. హైదరాబాదులోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ చెకింగ్‌ జరిగి.. అక్కడ్నుంచి రావడం వల్ల రెండు గంటలు ఆలస్యమైంది. విమానాశ్రయంలో దిగిన వీరు భౌతికదూరం పాటిస్తూ హెల్ప్‌ డెస్కుల వద్దకు రాగా.. రేణిగుంటకు చెందిన రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకున్నారు. మనదేశ సిమ్‌కార్డు అందజేసి ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. వైద్యులు ఫీవర్‌ సర్వే చేసి మాస్క్‌లు అందజేశారు. పది మంది చొప్పున వివరాలను నమోదు చేయడంతో శుక్రవారం వేకువజామున 2 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. వివరాలు పూర్తి చేసుకున్న వారు ఒక్కొక్కరుగా వెలుపలకు వచ్చి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కారు. నెల్లూరు, వైజాగ్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందితో బస్సు బయలుదేరింది. కడప జిల్లాకు చెందిన 115 మందిని ఐదు బస్సుల ద్వారా తరలించారు. జిల్లాకు చెందిన వారితో పాటు చెన్నై, అనంతపురం, కర్నూలుకు చెందిన వారిని తిరుపతి క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. ప్రతి బస్సులోను పోలీసు ఎస్కార్ట్‌ను పంపించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ ప్రవాసులకు పలు సూచనలు అందించారు. వీరికి విమానాశ్రయంలో అధికారులు తినుబండారా లు, పండ్లు అందించారు. 


జిల్లాలో 20 మంది క్వారంటైన్‌కు

జిల్లాతో పాటు చెన్నై, అనంతపురం, కర్నూలుకు చెందిన మొత్తం 20 మందిని ఉచిత, పెయిడ్‌ క్వారంటైన్లకు పర్యాటక శాఖాధికారులు తరలించారు. తిరుపతి నగరం పీకే లేఅవుట్‌లోని ఓ రెసిడెన్సీలో ఐదుగురు, రేణిగుంట రోడ్డులోని హోటల్‌లో ఒకరు, లక్ష్మీపురం సర్కిల్‌లోని మరో హోటల్‌లో ఆరుగురిని పెయిడ్‌.. మిగిలిన ఎనిమిది మందిని వికృతమాలలోని ఉచిత క్వారంటైన్‌కు పంపించారు. వీరికి హోటళ్ల వద్దే శ్వాబ్‌ పరీక్షలు నిర్వహించను న్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు.


బంధువుల భావోద్వేగం 

కువైత్‌ నుంచి వచ్చే తమవారిని చూడటానికి వివిధ జిల్లాల నుంచి కొందరు గురువారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి బంధువులను కలవడానికి పోలీసులు అనుమతించకపోవడంతో దూరం నుంచే టాటా చెప్పారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువతి ఐదు నెలల కిందట కువైత్‌లోని భర్త వద్దకు వెళ్లారు. అతడు అక్కడే ఉండిపోవడంతో గర్భిణి అయిన ఆమె ఈ ప్రత్యేక విమానంలో వచ్చారు. కోడలిని కలవడానికి అత్తగా వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దూరం నుంచే సైగల ద్వారా యోగక్షేమాలను తెలుసుకున్నారు. పండ్లసంచి పెట్టి వచ్చేయగా.. కోడలు దానిని తీసుకుని బస్సు ఎక్కారు. అనారోగ్యంతో వచ్చిన వ్యక్తినీ కలవడానికి కుటుంబీకులను అనుమతించలేదు. 

Updated Date - 2020-05-23T18:29:15+05:30 IST