అగ్ర‌రాజ్యంలో మృత్యు ఘోష‌..!

ABN , First Publish Date - 2020-04-04T20:24:54+05:30 IST

చైనాలో పుట్టిన క‌రోనావైర‌స్‌ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో త‌న ఉనికిని చాటుకుంది. క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ పోతున్నఈ సూక్ష్మ‌జీవి అగ్ర‌రాజ్యాల‌ను సైతం చిగురుటాకులా వ‌ణికిస్తోంది.

అగ్ర‌రాజ్యంలో మృత్యు ఘోష‌..!

24 గంట‌ల వ్య‌వ‌ధిలో దాదాపు 1480 మంది మృత్యువాత‌

వాషింగ్ట‌న్: చైనాలో పుట్టిన క‌రోనావైర‌స్‌ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో త‌న ఉనికిని చాటుకుంది. క్ర‌మంగా త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ పోతున్న ఈ సూక్ష్మ‌జీవి అగ్ర‌రాజ్యాల‌ను సైతం చిగురుటాకులా వ‌ణికిస్తోంది. కొవిడ్‌-19 ధాటికి అగ్ర‌రాజ్యం అమెరికా ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. యూఎస్‌లో రోజురోజుకీ విరుచుకుప‌డుతున్న ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 7వేల‌కు పైగా మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. గురువారం రాత్రి 8.30 గంట‌ల నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంట‌ల‌ వరకు ఇక్క‌డ‌ ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు సంభవించాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది. ఈ 24 గంటల వ్య‌వ‌ధిలో సుమారు 1,480 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. దీంతో  మృతుల సంఖ్య 7403కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య 2,77,522గా న‌మోదైంది.


కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 లక్షలకుపైగా క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 60వేల మంది మ‌ర‌ణించారు. ఇక యూఎస్‌లో కరోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరిగిపోతూ ఉండడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్‌  ట్రంప్‌ అమెరికన్లను మరో 4 వారాలు ఇళ్లకే ప‌రిమితం కావాల‌ని పిలుపునిచ్చారు. అలాగే వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం స్వీయ నిర్భంధం మాత్ర‌మేన‌ని ట్రంప్ పేర్కొన్నారు. క‌నుక నెల రోజుల పాటు ఇంట్లోనే ఉండాలంటూ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అటు ప్ర‌జ‌ల‌ను మాస్కులు ధ‌రించాల‌ని చెప్పిన ట్రంప్‌.. తాను మాత్రం మాస్క్ ధ‌రించ‌బోన‌ని చెప్పారు.          

Updated Date - 2020-04-04T20:24:54+05:30 IST