చం‘చల్‌’గూడేనా.. చర్చనీయాంశంగా కేటీఆర్‌ ప్రకటన..?

ABN , First Publish Date - 2021-08-30T06:49:12+05:30 IST

నగరంలో మరో చారిత్రక కట్టడం కనుమరుగు కానుంది

చం‘చల్‌’గూడేనా.. చర్చనీయాంశంగా కేటీఆర్‌ ప్రకటన..?
చంచల్‌గూడ జైలు

  • 145 ఏళ్ల నాటి జైలు కనుమరుగయ్యేనా?
    త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం

సైదాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నగరంలో మరో చారిత్రక కట్టడం కనుమరుగు కానుంది. దేశంలోనే పురాతనమైన 145 ఏళ్ల కాలం నాటి చంచల్‌గూడ కేంద్ర కారాగారం కథ ముగియనుంది. శనివారం చంచల్‌గూడలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్‌ మాదిరిగా చంచల్‌గూడ జైలును తరలించి, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు లేదా విద్యాసంస్థలను నెలకొల్పాలని ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్‌ తెలిపారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లి జైలుకు తరలించి రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు నవంబర్‌ 2015లో జరిగిన మైనార్టీ సంక్షేమ విభాగాల కార్యక్రమాల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. పలు సందర్భాల్లో సైతం సీఎంతో నాటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు నేటి మంత్రి మహమూద్‌ అలీ సైతం ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. ఓవైసీ విజ్ఞప్తితో ప్రభుత్వం త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


6వ నిజాం కాలంలో
చంచల్‌గూడ జైలును 1876లో 6వ నిజాం పాలనలో ప్రధాన వాస్తుశిల్పి నవాబ్‌ఖాన్‌ బహుదూర్‌ మీర్జా అక్బర్‌బేగ్‌ నిజాం-ఉల్‌-ముల్క్‌ అనే పేరుతో  నిర్మించారు. 49.32 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం వెయ్యి మంది ఖైదీల సామర్థ్యం ఉండేలా 23 బ్యారక్‌లతో జైలు నిర్మాణం పకడ్బందీగా చేపట్టారు. నాలుగు వాచ్‌ టవర్లతో పక్కా నిఘా వ్యవస్థతో రూపొందించారు. ఖైదీలను శిక్షించే సాధారణ జైలులా కాకుండా ఖైదీల్లో పరివర్తన తెచ్చే విధంగా చర్యలు చేపట్టారు. గత ఐదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో జైలును ఆధునికీకరించారు. ప్రత్యేకంగా మహిళా సెంట్రల్‌ జైలు సైతం కొనసాగుతోంది.


తరలింపు సరికాదు
చారిత్రక నేపథ్యం కలిగిన చంచల్‌గూడ జైలును ప్రభుత్వం తరలించే ఆలోచన చేయడం సరికాదని పలువురు కోరుతున్నారు. జైలు కూల్చివేస్తే 145 ఏళ్ల జైలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ చంచల్‌గూడ జైలు తరలింపు ప్రకటన చేసి నిర్ణయాన్ని మార్చుకున్నారని, ఎంపీ ఓవైసీ మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని అంటున్నారు. విద్యాసంస్థలు, హర్డ్‌వేర్‌ పార్కుల ఏర్పాటుకు నగర శివారు ప్రాంతాలలో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయని, అందులో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.


ఎంతో మంది ఉద్యమనేతలు
చంచల్‌గూడ జైలులో కరుడుగట్టిన నేరస్థులే కాదు.. స్వాతంత్య్ర సమరయోధులు, సాయుధ పోరాట యోధులు, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులు, మావోయిస్టు అగ్రనేతలు జైలు జీవితం గడిపారు. హిమచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్రాత్రేయ గతంలో కేంద్రమంత్రిగా జైలు సందర్శనకు వచ్చినప్పుడూ ఎమర్జన్సీ కాలంలో సంవత్సరం పాటు కారాగారంలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అంతేగాకుండా సీబీఐ, ఏసీబీ కేసులలో నిందితులను ఈ జైలుకే రిమాండ్‌కు తరలిస్తారు. అంతేగాకుండా వీదేశీ, ఐఎ్‌సఐ ఖైదీల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో ఉంచుతారు.


జగన్‌ 16 నెలల జైలు జీవితం ఇక్కడే
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు సుమారు 16 నెలలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డితో పాటు సీబీఐ కేసులలో పలువురు ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, మాజీ ఐఏఎస్‌ అధికారులు ఈ జైలులోనే రిమాండ్‌లో ఉన్నారు.  సత్యం రామలింగరాజు, కృషి బ్యాంకు చైర్మన్‌ కోసరాజు వెంకటేశ్వర్‌రావు, నకిలీ స్టాంపుల కుంభకోణం సృష్టించిన అబ్దుల్‌ కరీం తెల్గీ, ముంబాయి డాన్‌ అబూసలేం వంటి వారు చాలాకాలం రిమాండ్‌లో ఉన్నారు.

Updated Date - 2021-08-30T06:49:12+05:30 IST