ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. దుర్గిలో 144 సెక్షన్...

ABN , First Publish Date - 2022-01-03T17:20:42+05:30 IST

దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేత దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది.

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. దుర్గిలో 144 సెక్షన్...

గుంటూరు జిల్లా: దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేత దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. దుర్గిలో పల్నాడు టీడీపీ నేతలు నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఎన్టీఆర్ విగ్రహం సెంటర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. వ్యాపార సముదాయాలు మూసివేశారు.


మరోవైపు నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాచర్లకు చెందిన టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబును  హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి బైక్‌పై దుర్గి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు.


పట్టపగలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన జడ్పీటీసీ కుమారుడు సుత్తి తీసుకుని దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వసం చేయడానికి యత్నించడం కలకలం రేపింది. సేకరించిన వివరాల మేరకు.. దుర్గి మండల జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మండల కేంద్రమైన దుర్గిలోని బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతని చేతిలో సుత్తి ఉంది. అది తీసుకుని అక్కడే ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. అలా ఒకటి రెండు సార్లు సుత్తితో కొట్టాడు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న దుర్గి పోలీసులు అక్కడకు చేరుకొని కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే ఏడాదిన్నర కిందట మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి యత్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆగ్రహజ్వాలలు పెరిగాయి. కానీ సంయమనం పాటించాల్సిందిగా నియోజకవర్గ, జిల్లా నేతలు తమ పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-01-03T17:20:42+05:30 IST