హైదరాబాద్‌లో 1,400 కోట్లతో.. హ్యుందాయ్‌ టెస్ట్‌-ట్రాక్‌

ABN , First Publish Date - 2022-05-27T08:40:42+05:30 IST

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలిరోజే రూ. 600 కోట్ల పెట్టుబడులను సాధించిన తెలంగాణకు..

హైదరాబాద్‌లో 1,400 కోట్లతో.. హ్యుందాయ్‌ టెస్ట్‌-ట్రాక్‌

  • హ్యుందాయ్‌ సీఐవోతో మంత్రి కేటీఆర్‌ భేటీ
  • ‘క్షయవ్యాధి కిట్‌’ల యూనిట్‌పై ఈఎంపీ ప్రకటన
  • యూనిట్‌ను విస్తరించనున్న జీఎంఎం ఫాడులర్‌
  • ఇన్నోవేషన్‌తో భారత్‌ సత్వర అభివృద్ధి: కేటీఆర్‌
  • దావోస్‌లో ముగిసిన డబ్ల్యుఈఎఫ్‌ సమావేశాలు
  • నేడు నగరానికి చేరుకోనున్న మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): దావోస్‌లో జరిగిన ప్రపంచ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలిరోజే రూ. 600 కోట్ల పెట్టుబడులను సాధించిన తెలంగాణకు.. తాజాగా సమావేశాల చివరిరోజు ఒక్క హ్యుందాయ్‌ కంపెనీ నుంచే రూ. 1,400 కోట్ల పెట్టుబడులపై ప్రకటన వచ్చింది. దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ సీఐవో యాంగ్చోచి తెలంగాణ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సిద్ధమవుతున్న మొబిలిటీ క్లస్టర్‌లో రూ. 1,400 కోట్లతో టెస్ట్‌-ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు యాంగ్చోచి ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉంటామన్నారు. టెస్ట్‌-ట్రాక్‌లతోపాటు.. ఎకోసిస్టమ్‌కు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైనా యాంగ్చోచి, కేటీఆర్‌ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 


తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్‌ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని అన్నారు. హ్యుందాయ్‌ కంపెనీకి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హ్యుందాయ్‌ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్షయవ్యాధి డయాగ్నస్టిక్‌ కిట్‌లను తయారుచేేస గ్లోబల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీని హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్‌లను తయారుచేస్తామని, వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘‘5 దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాయి. ఉత్పత్తికి హైదరాబాదే చక్కటి గమ్యస్థానంగా భావిస్తున్నాం. ఈ ప్లాంట్‌ ఏర్పాటు తర్వాత.. రూ. 50 కోట్ల పెట్టుబడులతో.. 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాం’’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కేంద్రంగా టీబీపై చేసే యుద్ధానికి తమ సహకారం ఉంటుందన్నారు. 


జీఎంఎం ఫాడులర్‌ విస్తరణ

ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్‌ రియాక్టర్‌, ట్యాంక్‌, కాలమ్‌లను తయారుచేసే జీఎంఎం ఫాడులర్‌ కంపెనీ.. హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రం విస్తరణను దావోస్‌ వేదికగా వెల్లడించింది. అదనంగా రూ. 30 కోట్ల మేర పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ యూనిట్‌ విస్తరణ ప్రణాళికలను గురించి వివరించారు. చివరిరోజు మంత్రి కేటీఆర్‌ నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం నగరానికి తిరిగి రానున్నారు.


మాస్టర్‌కార్డ్‌తో అవగాహన ఒప్పందం

ప్రపంచ దిగ్గజ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌/సొల్యూషన్స్‌ సంస్థ ‘మాస్టర్‌కార్డ్‌’తో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. దావోస్‌ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీఆర్‌, మాస్టర్‌కార్డ్‌ వ్యూహాత్మక అభివృద్ధి విభాగం వైస్‌ చైర్మన్‌ మైఖేల్‌ ప్రోమాన్‌ భేటీ అయ్యారు. డిజిటల్‌ తెలంగాణ సాధనలో భాగంగా మాస్టర్‌కార్డ్‌ సహకారంపై ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి డిజిటలైజేషన్‌ను ప్రపంచస్థాయిలో బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. ‘‘ముఖ్యంగా పౌర సేవలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు(ఎ్‌సఎంబీ), రైతులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ సరఫరా చైన్‌ను డిజిటలైజ్‌ చేయడం వల్ల రైతులు లబ్ధి పొందుతారు. సైబర్‌సెక్యూరిటీని పటిష్ఠం చేయడం, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, ప్రభుత్వ విలువల చైన్‌ను విస్తరించడం, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు పారదర్శక చెల్లింపులు, ప్రపంచస్థాయి పేమెంట్‌ సొల్యూషన్స్‌ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం’’ అని కేటీఆర్‌ వివరించారు.


ఇన్నోవేషన్‌తో భారత్‌ సత్వర అభివృద్ధి: కేటీఆర్‌ 

ఇన్నోవేషన్‌తోనే భారతదేశ సత్వర అభివృద్ధి సాధ్యమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఇన్నోవేషన్‌ అంటే.. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానమే కాకుండా.. మానవ జీవితంలో ప్రతి సమస్య మొదలు.. మునిసిపాలిటీ, గ్రామాల సమస్యలకూ పరిష్కారాలకు శక్తినివ్వగలగాలన్నారు. ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని వేగంగా ముందుకు వెళ్లాలంటే.. 3ఐ (ఇన్నోవేట్‌, ఇంకుబెట్‌, ఇన్‌కార్పొరేట్‌) మంత్రమే మార్గం అన్నారు. స్టార్ట్‌పలలో 95ు విఫలం అయ్యే అవకాశం ఉన్నా, నూతన ఆలోచనలకు ప్రోత్సాహమివ్వాల్సిన అవసరముందన్నారు. అందుకే ప్రభుత్వాలు ఇన్నోవేషన్‌ రంగానికి సహకారం అందిస్తూనే ఉండాలన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించాలనే రాష్ట్రంలో టీ-హబ్‌, వీ-హబ్‌లను నెలకొల్పినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ స్టార్ట్‌పలకు రాజధానిగా మారనుందన్నారు. 

Updated Date - 2022-05-27T08:40:42+05:30 IST