పర్యావరణ సదస్సులో దేశాధినేతలను కడిగిపారేసిన 14 ఏళ్ల భారత బాలిక!

ABN , First Publish Date - 2021-11-04T13:09:45+05:30 IST

భారతదేశానికి చెందిన 14 ఏళ్ల బాలిక ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్న వాతావరణ మార్పుల సదస్సులో స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకుంది.

పర్యావరణ సదస్సులో దేశాధినేతలను కడిగిపారేసిన 14 ఏళ్ల భారత బాలిక!

పర్యావరణ పరిరక్షణపై వట్టి హామీలు వద్దు

కాలుష్యంపై నిర్మించే ఆర్థిక వ్యవస్థలూ..

మీపై మా తరం విసిగిపోయింది

మేం భవిష్యత్తును నిర్మించుకుంటాం

దేశాధినేతలపై భారత బాలిక గర్జన

పర్యావరణ సదస్సులో వినిశా ప్రసంగం

న్యూఢిల్లీ, నవంబరు 3: భారతదేశానికి చెందిన 14 ఏళ్ల బాలిక ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్న వాతావరణ మార్పుల సదస్సులో స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకుంది. ‘పర్యావరణ ఆస్కార్స్‌’గా పిలిచే ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ ఫైనలిస్టుల్లో తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వినిశా ఉమాశంకర్‌ ఒకరు. ఆమెను బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ కాప్‌-26 సదస్సులో పర్యావరణ హిత టెక్నాలజీ, ఆవిష్కరణల గురించి ప్రసంగించేందుకు గ్లాస్గోకు ఆహ్వానించారు. ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో వినిశా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. 


మాటలు ఆపి.. చేతలు మొదలుపెడదాం..

‘మాటలు ఆపి.. చేతలు మొదలు పెడదామని గౌరవనీయులైన మీ అందరినీ కోరుతున్నా. ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టులమైన మేం..మా ఆవిష్కరణలు, పరిష్కారాలు, ప్రాజెక్టులకు మీ మద్దతు అవసరమని కోరుతున్నాం. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యంపై నిర్మించే ఆర్థిక వ్యవస్థలు వద్దు. మన భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మీ డబ్బు, సమయం, కృషి మాపై పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉంది. మాతో చేతులు కలపాలని ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టుల తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఇకనైనా పాత అలవాట్లు, పాత ఆలోచనలు వదిలేస్తారని ఆశిస్తున్నా. అయితే, మీరు లేకున్నా, మేం నేతృత్వం వహిస్తాం. మీరు రాకున్నా, మేం చేసుకుంటాం. ఇప్పటికీ మీరు గతంలోనే ఇరుక్కుపోయినా, మేం భవిష్యత్తును నిర్మించుకుంటాం. కానీ దయచేసి నా ఆహ్వానాన్ని స్వీకరించండి’ అని వినిశా స్పష్టం చేశారు.


‘వట్టి హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయని నేతల పట్ల మా తరంలోని చాలామంది ఆగ్రహంతోనూ, విసిగివేసారిపోయి ఉన్నారు. అయినా.. ఆగ్రహం వ్యక్తం చేసేంత సమయం నాకు లేదు. నేను సాధించాలనుకుంటున్నాను. నేను భారత పుత్రికను మాత్రమే కాదు, పుడమి పుత్రికను. ఇందుకు నేను గర్విస్తున్నా’ అని వినిశా పేర్కొన్నారు. 


ఏమిటీ ఎర్త్‌షాట్‌ ఫ్రైజ్‌..

పర్యావరణ సవాళ్లకు వినూత్న పరిష్కారాలు కనుగొనడం కోసం ప్రిన్స్‌ విలియమ్స్‌ ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ను రూపొందించారు. వాతావరణాన్ని పరిరక్షించడంలో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి ఈ బహుమతులు అందజేస్తున్నారు. వినిశా తమ వీధిలో ఉన్న రజకుల ఇస్ర్తీ పెట్టె నుంచి వెలువడే పొగతో వాతావరణం కలుషితమవుతోందని గమనించారు. దీనికి పరిష్కారంగా సౌరశక్తితో పనిచేసే ఇస్ర్తీ బండిని ఆమె రూపొందించారు. ఆ ఆవిష్కరణ ఆమెను ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచేలా చేసింది.

Updated Date - 2021-11-04T13:09:45+05:30 IST