సాగర్‌ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-02T08:24:35+05:30 IST

కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఆదివారం 14 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల

సాగర్‌ గేట్లు ఎత్తివేత

14 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ఆగస్టు మొదట్లో గేట్లెత్తడం పదిహేనేళ్లలో ఇదే  ప్రథమం

నేడు సందర్శించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌?


మాచర్ల, శ్రీశైలం, ఆగస్టు 1: కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఆదివారం 14 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,06,642 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేయడం గత పదిహేనేళ్లలో ఇదే ప్రథమం. జూలై 25 నుంచి ఆగస్టు 1వ తేదీ నాటికే రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యానికి చేరుకోవడం ఆనందదాయకమని ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ చెప్పారు. 


రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా 15 రోజులు ముందుగానే రిజర్వాయర్‌ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువైందన్నారు. రాత్రికి మరో లక్షన్నర క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. 2019-20లో వరదలకు స్పిల్‌వే గుంతలు ఏర్పడ్డాయని, అతి తక్కువ సమయంలో వరద రావడంతో పనులు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం హాలియా పర్యటనకు వస్తున్నారని, ప్రాజెక్ట్‌ను సందర్శించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధుల విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఈ ధర్మానాయక్‌ చెప్పారు. 


శ్రీశైలానికి కొనసాగుతున్న వరద 

శ్రీశైలం రిజర్వాయర్‌కు జూరాల, సుంకేశుల నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్‌ 10 క్రస్టుగేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి ఆదివారం 3,63,993 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 67,734 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 883.50 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 207.4103 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి కోసం ఏపీ 30,094 క్యూసెక్కులు, తెలంగాణ 31,784 క్యూసెక్కుల వినియోగించుకుని దిగువకు వదులుతున్నాయి. డ్యామ్‌ క్రస్టుగేట్ల ద్వారా 3,72,220 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T08:24:35+05:30 IST