రిపాట్రియేష‌న్ విమానాల్లో వ‌చ్చిన ప్ర‌వాసుల వ‌ద్ద రూ.15 కోట్ల ప‌సిడి ప‌ట్టివేత‌

ABN , First Publish Date - 2020-07-05T15:16:35+05:30 IST

రిపాట్రియేష‌న్ విమానాల్లో సౌదీ అరేబియా, యూఏఈల నుంచి వ‌చ్చిన 14 మంది భార‌త ప్ర‌వాసుల వ‌ద్ద జైపూర్‌ విమానాశ్ర‌యంలో‌ ఏకంగా రూ. 15కోట్లు విలువ చేసే బంగారం ప‌ట్టుబ‌డింది.

రిపాట్రియేష‌న్ విమానాల్లో వ‌చ్చిన ప్ర‌వాసుల వ‌ద్ద రూ.15 కోట్ల ప‌సిడి ప‌ట్టివేత‌

సౌదీ అరేబియా, యూఏఈల నుంచి వ‌చ్చిన 14 మంది భార‌త ప్ర‌వాసులు

జైపూర్‌ విమానాశ్ర‌యంలో ల‌గేజీ త‌నిఖీలో బ‌య‌ట‌ప‌డ్డ బంగారం

జైపూర్: రిపాట్రియేష‌న్ విమానాల్లో సౌదీ అరేబియా, యూఏఈల నుంచి వ‌చ్చిన 14 మంది భార‌త ప్ర‌వాసుల వ‌ద్ద జైపూర్‌ విమానాశ్ర‌యంలో‌ ఏకంగా రూ. 15కోట్లు విలువ చేసే బంగారం ప‌ట్టుబ‌డింది. ప్ర‌వాసులు ప‌సిడిని ఎమ‌ర్జెన్సీ ల్యాంపుల్లో దాచిపెట్టి  తీసుకొచ్చినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్ల‌డించారు. వివ‌రాల్లోకి వెళ్తే... రాస్ అల్‌ఖైమా నుంచి స్పైస్ జెట్ విమానం ఎస్‌జీ-9055లో వ‌చ్చిన ముగ్గురు ఎన్నారైలపై అనుమానంతో వారి ల‌గేజీని సోదా చేసిన అధికారుల‌కు 9.339కిలోల బ‌రువు గ‌ల‌‌ 12 గోల్డ్ బార్స్ దొరికాయి. ‌వాటి విలువ 2.25 మిలియ‌న్ దిర్హామ్స్‌(రూ.45,761,100) ఉంటుంద‌ని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు.  


అలాగే సౌదీ అరేబియా నుంచి వ‌చ్చిన మ‌రో రిపాట్రియేష‌న్ విమానంలోని 11 మంది భార‌త ప్ర‌వాసుల‌ను త‌నిఖీ చేయ‌గా వారి ల‌గేజీ నుంచి 22.6528 కిలోల ప‌సిడి ప‌ట్టుబ‌డింది. దీని విలువ 5.45 మిలియ‌న్ దిర్హామ్స్(రూ. 110,998,720). ఇలా ఈ రెండు రిపాట్రియేష‌న్ విమానాల్లో క‌లిపి మొత్తం సుమారు రూ. 15కోట్లు విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం ఈ 14 మంది ఎన్నారైల‌ను అదుపులోకి తీసుకుని క‌స్ట‌మ్స్ అధికారులు విచారిస్తున్నారు. ఇక క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల గ‌ల్ప్ దేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల‌ను 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా కేంద్రం స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే.  

Updated Date - 2020-07-05T15:16:35+05:30 IST