chennai: 14 జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2021-10-17T14:07:12+05:30 IST

ఉపరితల ఆవర్తనం, రుతువపనాల ప్రభావం కారణంగా 14 జిల్లాల్లో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సంచాలకుడు పువియరసన్‌ మీడియాతో మా

chennai: 14 జిల్లాలకు భారీ వర్ష సూచన

           - కన్నియాకుమారిలో కుండపోత


చెన్నై: ఉపరితల ఆవర్తనం, రుతువపనాల ప్రభావం కారణంగా 14 జిల్లాల్లో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సంచాలకుడు పువియరసన్‌ మీడియాతో మాట్లాడుతూ... శనివారం ఉదయం నీలగిరి, కోయం బత్తూరు, తేని జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసినట్టు తెలిపారు. ఆదివారం కన్నియా కుమారి, తెన్‌కాశి, తేని, దిండుగల్‌, మదురై, శివగంగ, కరూరు, నామక్కల్‌, తిరుచ్చి, పుదుకోట, కడలూరు, సేలం, ఈరోడ్‌, పెరంబలూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం దక్షిణాది జిల్లాల్లో ప్రత్యేకించి సముద్రతీర జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. పుదుకోట, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి జిల్లాల్లో ఈ నెల 20న కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ఇదిలా వుండగా కన్నియాకుమారి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం స్తంభించింది. గత రెండు రోజులుగా జాలర్లు చేపలవేట మానుకున్నారు. నాగర్‌కోవిల్‌ లోనూ రాత్రంతా చెదురుముదురగా కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలన్నీ దీవులుగా మారాయి. కన్నియాకుమారి జిల్లాలోని వాగులు, వంక లు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరునల్వేలి, తెన్‌ కాశి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటకోత పనులన్నీ ఆగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ రెండు జిల్లాలకు చెందిన జాలర్లు రెండు రోజులుగా చేపలవేట మానుకున్నారు. రెండువేలకు పైగా నాటుపడవలను తీరం వద్దే లంగరేసి నిలిపివేశారు. ఇదిలా వుండగా కర్నాటకలోని కృష్ణరాజసాగర్‌ సహా అన్ని జలాశయాల నుంచి అదనపు జలాలను విడుదల చేయడంతో మెట్టూరు డ్యామ్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఆ డ్యామ్‌లోకి సెకనుకు 12 వేల ఘనపుటడుగుల మేర నీరు చేరింది. ప్రస్తుతం ఆ డ్యామ్‌లో నీటి మట్టం 89 అడుగులకు పెరిగింది.

Updated Date - 2021-10-17T14:07:12+05:30 IST