ఈ 14 దేశాల్లో మన రూపాయే చాలా ఖరీదు.. తక్కువ ఖర్చుతో విదేశీ టూర్‌కు వెళ్లండిలా..

ABN , First Publish Date - 2021-10-01T17:57:03+05:30 IST

విదేశీ టూర్లు అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. కానీ, ఆ టూర్లకు అయ్యే ఖర్చులే మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. అయితే మన రూపాయి బలంగా ఉన్న ఈ 14 దేశాల్లో చాలా తక్కువ వ్యయంతో టూర్‌కెళ్లి రావొచ్చు. మన భారతీయ రూపాయికి డాలర్ లేదా పౌండ్‌కి ఉన్నంత విలువ ఉండకపోవచ్చు. కానీ ఇది ఇప్పటికీ అనేక ప్రపంచ దేశాల కరెన్సీల కంటే...

ఈ 14 దేశాల్లో మన రూపాయే చాలా ఖరీదు.. తక్కువ ఖర్చుతో విదేశీ టూర్‌కు వెళ్లండిలా..

ఎన్నారై డెస్క్: విదేశీ టూర్లు అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. కానీ, ఆ టూర్లకు అయ్యే ఖర్చులే మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. అయితే మన రూపాయి బలంగా ఉన్న ఈ 14 దేశాల్లో చాలా తక్కువ వ్యయంతో టూర్‌కెళ్లి రావొచ్చు. మన భారతీయ రూపాయికి డాలర్ లేదా పౌండ్‌కి ఉన్నంత విలువ ఉండకపోవచ్చు. కానీ ఇది ఇప్పటికీ అనేక ప్రపంచ దేశాల కరెన్సీల కంటే బలంగా ఉంది. ఇలా భారతీయ కరెన్సీకి ఎక్కువ విలువ ఉన్న 14 దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఆయా దేశాలలోని ప్రధాన సందర్శన ప్రదేశాలు, అక్కడ మన రూపాయి విలువపై ఓ లుక్కేద్దాం.


1. ఇండోనేషియా 

ద్వీపాల దేశంగా పేరొందిన ఇండోనేషియా.. బ్లూ వాటర్, ఉష్ణమండల వాతావరణానికి ప్రత్యేకం. బాలి ఇక్కడ అత్యంత ప్రసిద్ధ సందర్శన గమ్యస్థానాలలో ఒకటి. ఈ దేశం భారతీయులకు ఉచితంగా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంతేగాక ఇక్కడ మన రూపాయి విలువ చాలా ఎక్కువ. ఈ దేశంలో మన ఒక రూపాయి.. 197.6 ఇండోనేషియా రుపియాకు సమానం. కనుక చాలా తక్కువ వ్యయంతో ఇండోనేసియాకు వెళ్లి రావొచ్చు.


2. వియత్నాం

బౌద్ధ పగోడాలు, ప్రత్యేకమైన వియత్నామీస్ వంటకాలు, నదులకు ప్రసిద్ధి చెందిన దేశం. ఇక్కడి నదులలో మీరు కయాకింగ్(పడవలాంటి వాటిపై బోటింగ్) చేయవచ్చు. వియత్నాం భారతీయులకు ఖచ్చితంగా సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా భిన్నమైన సంస్కృతిని కలిగి ఉంటుంది. యుద్ధ సంగ్రహాలయాలు, ఫ్రెంచ్ వలసరాజ్యాల నిర్మాణం దేశంలోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. వీటిని తప్పకుండా సందర్శించాల్సిందే. ఈ దేశంలో కూడా మన రూపాయి చాలా స్ట్రాంగ్ కనుకు తక్కువ ఖర్చుతోనే విజిట్ చేసే వీలుంది. ఇక్కడ మన రూపాయి విలువ.. 326.87 వియత్నాం డాంగ్‌కు సమానం. 


3. కంబోడియా

భారతీయులు బడ్జెట్‌లో వెళ్లి రాగలిగే మరో దేశం కంబోడియా. ఇక్కడి భారీ రాతి దేవాలయం అయిన ఆంగ్‌కోర్ వాట్‌ అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ దేశంలోని రాయల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం, పురావస్తు శిథిలాలు ఇతర ప్రధాన ఆకర్షణలు అని చెప్పొచ్చు. ఇక కంబోడియాకు వెస్ట్రన్ దేశాల నుండి వచ్చే పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఇప్పుడిప్పుడే దాని ప్రజాదరణ నెమ్మదిగా భారతీయులలో కూడా విస్తరిస్తోంది.

* 1 భారత రూపాయి = 57.34 కంబోడియన్ రియల్


4. శ్రీలంక

మనకు పొరుగు దేశమైన శ్రీలంక బీచ్‌లు, పర్వతాలు, ఆకుపచ్చని పచ్చదనం, చారిత్రక కట్టడాలకు నిలయం. శ్రీలంక ప్రస్తుతం భారతీయులు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఇండియాకు చాలా దగ్గరగా ఉండడం, విమాన టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండడంతో శ్రీలంకకు మనోళ్లు భారీగానే వెళ్తుంటారు. ఈ దేశంలో మన ఒక రూపాయి.. 2.56 శ్రీలంక రూపాయిలకు సమానం.


5. నేపాల్

భూమిపై అత్యంత అద్భుతమైన దృశ్యాలను ఈ దేశపు భూభాగం కలిగి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతం, ప్రపంచంలోని ఏడు ఇతర ఎత్తైన పర్వత శిఖరాలు నేపాల్‌లో ఉన్నాయి. ఈ దేశానికి వెళ్లేందుకు భారతీయులకు వీసా కూడా అక్కర్లేదు. ఇక్క మన ఒక రూపాయి.. 1.60 నేపాలీ రూపాయికి సమానం. 


6. ఐస్‌ల్యాండ్

ఈ ద్వీప దేశం భూమిపై ఉన్న అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. వేసవిలో వేడి నుంచి ఉపసమనం పొందేందుకు ఇది చక్కటి గమ్యస్థానం అని చెప్పొచ్చు. నీలం మడుగులు, జలపాతాలు,  హిమానీనదాలు, నల్ల ఇసుక బీచ్‌లకు ఐస్‌ల్యాండ్ ప్రసిద్ధి చెందింది. 

* 1 భారత రూపాయి = 1.73 ఐస్లాండిక్ క్రోనా



7. హంగేరీ

ఇది మరో ద్వీపకల్ప దేశం. హంగేరీ ఆర్కిటెక్చర్‌కు పెట్టింది పేరు. రోమన్, టర్కిష్‌తో పాటు ఇతర సంస్కృతులకు ఈ దేశం ప్రసిద్ధి చెందింది. హంగేరీ వెళ్తే తప్పకుండా అక్కడి పురాతన కోటలు, పార్కులను సందర్శించాల్సిందే. అలాగే ఆ దేశ రాజధాని అయిన బుడాపెస్ట్ ప్రపంచంలోని అత్యంత రొమాంటిక్ నగరాలలో ఒకటి. ఈ దేశంలో మన ఒక రూపాయి.. 4.17 హంగేరియన్ ఫోరింట్‌కు సమానం. 


8. జపాన్

ఇక్కడి సుశి, చెర్రీ, సేక్ వంటి ఉద్యానవనాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. భారత రూపాయి కంటే కరెన్సీ విలువ తక్కువగా ఉన్న దేశాలలో ఇది ఒకటి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ ఒకటి. ఈ దేశంలోని పుణ్యక్షేత్రాలు, జాతీయ ఉద్యానవనాలు, ఆకాశహర్మ్యాలను తప్పక  సందర్శించాల్సిందే. ఇక్కడ మన ఒక రూపాయి విలువ 1.55 జపనీస్ యెన్‌కు సమానం. 


9. పరాగ్వే

పరాగ్వే కూడా ఒక ద్వీప దేశమే. పరాగ్వే దక్షిణ అమెరికాలో ఉంది. బ్రెజిల్, అర్జెంటీనా వంటి పొరుగు దేశాలను ఇష్టపడే ప్రయాణికులకు ఇది మొదటి చాయిస్ కాదనే చెప్పాలి. ఏదేమైనా పరాగ్వే ప్రకృతి సౌందర్యాలు కట్టిపడేస్తాయి. గ్రామీణ హస్తకళలను విక్రయించే షాపింగ్ కేంద్రాలతో పాటు వలసరాజ్యాల పట్టణాలు ఇక్కడ మనకు దర్శనిమిస్తాయి.

* 1 భారత రూపాయి = 90.93 పరాగ్వే గ్వారాని


10. మంగోలియా

ఇక్కడి ప్రజలు అనుసరించే సంచార జీవనశైలికి మంగోలియా ప్రసిద్ధి. నీలి ఆకాశపు భూమిగా పిలువబడే మంగోలియాలో విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రకృతి అందాలను గంటల తరబడి ఆస్వాదించవచ్చు. ఇక్కడ మన ఒక రూపాయి విలువ 38.40 మంగోలియన్ తుగ్రిక్‌కు సమానం. 


11. కోస్టారికా

మధ్య అమెరికాకు చెందిన ఈ దేశం అందమైన బీచులతో సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది. అగ్నిపర్వతాలు, అడవులు, అందులోని వన్యప్రాణులు వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఇది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని టూరిస్టులు బాగా ఇష్టపడతారు. ఇంకా కోస్టారికాలో పర్యావరణ పర్యాటకం విస్తృతంగా వ్యాపించింది. 

* 1 భారత రూపాయి = 8.00 కోస్టారికన్ కోలన్


12. పాకిస్థాన్

భారత్ నుంచి వేరుపడి దాయాదిగా మారిన పాకిస్థాన్‌కు కూడా కొంతమంది సందర్శనకు వెళ్తుంటారు. ఏదేమైనా ఇది అనేక ఆసక్తికరమైన ప్రదేశాలను కలిగి ఉంది. తక్కువ కరెన్సీ రేటు పర్యాటకులకు చౌకైన గమ్యస్థానంగా మార్చింది. స్వాత్ జిల్లా, కరాచీ, లాహోర్ వంటివి పాక్‌లో ప్రధానమైన సందర్శనాస్థలాలు అని చెప్పొచ్చు. ఈ దేశంలో మన ఒక రూపాయి విలువ.. 2.19 పాకిస్తానీ రూపాయికి సమానం. 


13. చిలీ

ఉద్యానవనాలు, విశాలమైన అడవులు చిలీకి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టాయి. అక్కడి పర్వత శ్రేణీ పర్వతారోహణలకు బాగా అనుకూలం. అలాగే అనేక గ్నిపర్వత శిఖరాలను కలిగి ఉంది. చిలీలోని లేక్ డిస్ట్రిక్ట్ మరొక ఆసక్తికరమైన ప్రదేశం. ఆ దేశంలోని పొలాలు, నది, లోయలు, ద్రాక్షతోటలు సందర్శకులను కట్టిపడేస్తాయి.

* 1 భారత రూపాయి = 10.75 చిలియన్ పెసో


14. దక్షిణ కొరియా

దక్షిణ కొరియాలోని వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలు సందర్శకులను ఆనందం కలిగిస్తాయి. చేపలు పట్టే గ్రామాలు, బౌద్ధ దేవాలయాలు, పల్లెల పచ్చదనం, చెర్రీ చెట్లకు ఈ దేశం ప్రసిద్ధి. ఇవి కాకుండా దక్షిణ కొరియా ఉష్ణమండల ద్వీపాలు, హైటెక్ నగరాలను కూడా కలిగి ఉంది. ఇక్కడ మన ఒక రూపాయి విలువ 16.49 దక్షిణ కొరియా వోన్‌కు సమానం. ఈ దేశాల్లో మన రూపాయి విలువ ఎక్కువ కనుక తక్కువ వ్యయంతోనే టూర్ వేసి రావొచ్చు. ఇంకేందుకు ఆలస్యం ఈ 14 దేశాల్లో ఏదో ఒక దేశానికి వెళ్లొచ్చయండి మరీ. 

Updated Date - 2021-10-01T17:57:03+05:30 IST