నీ ప్రేయసి ఎవరో నాకు తెలుసంటూ కన్నతండ్రినే బెదిరించిన 13 ఏళ్ల బాలుడు.. Cyber ​​Attack కేసులో నివ్వెరపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-06-22T20:15:39+05:30 IST

జైపూర్ సైబర్ ఎటాక్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి.

నీ ప్రేయసి ఎవరో నాకు తెలుసంటూ కన్నతండ్రినే బెదిరించిన 13 ఏళ్ల బాలుడు.. Cyber ​​Attack కేసులో నివ్వెరపోయే నిజాలు..!

జైపూర్ సైబర్ ఎటాక్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. 13 ఏళ్ల బాలుడు కన్న తల్లిదండ్రుల ఫోన్లనే హ్యాక్ చేసి వారిని బెదిరించాడు. మొదట ఎవరో తనను హిప్నటైజ్ చేసి అలా చేయించారని చెప్పిన బాలుడు.. విచారణలో నిజం అంగీకరించాడు. తన వెనుక ఎవరూ లేరని, తన ప్రయోజనాల కోసమే అలా చేశానని ఒప్పుకున్నాడు. 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తన తల్లిదండ్రుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశాడు. అలాగే తల్లిదండ్రుల ఫోన్‌లలో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి బెదిరించాడు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


ఇది కూడా చదవండి..

70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకునేందుకు పేపర్లో ఇచ్చిన ఒక్క ప్రకటనతో రూ.1.80 కోట్లు మటాష్..!


తండ్రి ఫిర్యాదుతో సైబర్‌ నిపుణులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. 13 ఏళ్ల బాలుడే హ్యాకింగ్‌లో కీలక పాత్ర పోషించాడని తేలిన తర్వాత..  తప్పించుకునేందుకు ఆ బాలుడు ఎన్నో కథలు అల్లాడు. అయితే చివరకు ఆ బాలుడు తన తప్పును అంగీకరించాడు. తండ్రిని భయపెట్టడానికి హ్యాకింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. ఆ కుర్రాడు వాట్సాప్ ద్వారా తండ్రిని బెదరించాడు. అంతేకాదు తన తండ్రికి పంపిన మెసేజ్‌లో.. `నీ గాళ్‌ఫ్రెండ్ ఎవరో నాకు తెలుసు` అంటూ బెదిరింపులకు దిగాడు. 


`పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుందో చెప్పను. నా మనిషి మీ దగ్గరే ఉన్నాడు. నా నెట్‌వర్క్ మీ ఇంట్లో ప్రతిచోటా ఉంద`ని మరో మెసేజ్‌లో బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ నిపుణులు ఫేస్‌బుక్ ఖాతాలో డర్టీ పోస్ట్‌లు, కామెంట్‌లు చేసిన మొబైల్ ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. దాని ద్వారా నిజం బయటపడింది. నిజానికి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ కాలేదని, ఇంట్లోని మొబైల్ నుంచే మెసేజ్ పోస్ట్ చేసినట్లు గుర్తించారు. అప్పుడు వారి అనుమానం 13 ఏళ్ల బాలుడి పైకి మళ్లింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 

Updated Date - 2022-06-22T20:15:39+05:30 IST