13 నుంచి పాఠశాలలు.. శనివారం సెలవు

ABN , First Publish Date - 2022-05-26T16:32:13+05:30 IST

రాష్ట్రంలో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం

13 నుంచి పాఠశాలలు.. శనివారం సెలవు

- 20 నుంచి ప్లస్‌టూ తరగతులు

- కార్పొరేషన్‌ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం 

- పబ్లిక్‌ పరీక్షల తేదీల వెల్లడి


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగిసిన తరువాత జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం (2022-23)లో ప్రతి శనివారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. పబ్లిక్‌ పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాకపోగా, 2021-22 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా తెరుచుకున్నాయి. దీంతో సిలబ్‌సను కూడా తగ్గించారు. అలాగే, పనిదినాలు తక్కువగా ఉండడంతో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేశా యి. ఈ నెల 5న ప్రారంభమైన 10, ప్లస్‌ వన్‌, ప్లస్‌టూ తరగతుల పబ్లిక్‌ పరీక్షలు 31వ తేది వరకు జరుగనున్నాయి. అలాగే, 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ముగియడంతో ఈ నెల 14వ తేది నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. పాఠశాలల పునఃప్రారంభం తేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. 


జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్‌ 13వ తేది నుంచి ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ప్రకటించారు. సచివాలయంలో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు జూన్‌ 13న, 12వ తరగతివారికి 20వ తేదీన, 11వ తరగతికి 27వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. సరైన సమయానికి పాఠశాలలు ప్రారంభిస్తుండడంతో ఇకపై ప్రతి శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3న, ప్లస్‌ వన్‌ పరీక్షలు మార్చి 14వ తేదీ, ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 13వ తేదీన ప్రారంభమవుతాయన్నారు. అలాగే, 1 నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్‌ 20 నుంచి 26వ తేది వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. కాగా కార్పొరేషన్‌ పాఠశాలలు ప్రారంభించిన వెంటనే ఉదయం 8.30 గంటలకు అల్పాహారం అందిస్తామని, 9 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ప్రయోగాత్మకంగా కార్పొరేషన్‌ పాఠశాలలో ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని భవిష్యత్తులో అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి వివరించారు. 


త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షలు...

త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్ష తేదీలు కూడా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఆ ప్రకారం, ప్లస్‌ వన్‌, ప్లస్‌టూ తరగతులకు సెప్టెంబరు 23 నుంచి 30వ తేది వరకు త్రైమాసిక పరీక్షలు, డిసెంబరు 23 నుంచి జనవరి 2వ తేది వరకు అర్ధవార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇక, 1 నుంచి 10వ తరగతుల వారికి సెప్టెంబరు 26 నుండి 30వ తేది వరకు త్రైమాసిక పరీక్షలు, డిసెంబరు 19 నుంచి 23వ తేది వరకు అర్ధవార్షిక పరీక్షలు జరుగనున్నాయి. 

Updated Date - 2022-05-26T16:32:13+05:30 IST