ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు దేశవ్యాప్తంగా జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లలో 139 మంది మరణించినట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖా మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. ఎన్కౌంటర్లకు సంబంధించి పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. రాజ్యసభలో సీపీఐ సభ్యుడు వినోయ్ విశ్వమ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సభలో గురువారం నిత్యానంద ఈ ప్రకటన చేశారు. నిత్యానంద సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం ఏడాది కాలంలో అత్యధికంగా జమ్మూ-కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లలో 38 మంది, ఛత్తీస్‌ఘడ్‌లో 28 మంది మరణించారు. అంతకుముందు 2016-17లో 169 మంది, 2017-18లో 155 మంది, 2018-19లో 156 మంది, 2019-20లో 112 మంది, 2020-21లో తక్కువగా 82 మంది మరణిచారు. జాతీయ మానవ హక్కుల సంఘం 2018లో అస్సాంలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐదేళ్లకాలంలో జరిగిన 107 ఎన్కౌంటర్లకు సంబంధించి మృతుల కుటుంబాలకు 7,16,50,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని మానవ హక్కుల సంఘం సూచించింది.