1,365 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-14T06:23:16+05:30 IST

జిల్లాలో గత 24 గంటల్లో 5,045 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,365 మంది వైరస్‌ బారిన పడ్డారు.

1,365 కరోనా కేసులు

  1. నలుగురి మృతి 


కర్నూలు(హాస్పిటల్‌), మే 13: జిల్లాలో గత 24 గంటల్లో 5,045 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,365 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 97,242కు చేరగా.. 8,859 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో కోలుకుని 87,768 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. 


ఆ కుటుంబంపై కరోనా కాటు


  1. వారంలోపే అన్నా, తమ్ముడు మృత్యువాత


పత్తికొండ టౌన్‌, మే 13: కరోనా ఆ కుటుంబాన్ని కాటేసింది. వారంలోపే ఒకే కుటుంబంలో అన్నా తమ్ముడు మృతి చెందారు. పత్తికొండకు చెందిన ఎరుకుల రాముడు, తమ్ముడు  అంజికి 10 రోజుల క్రితం కరోనా సోకింది. ఈనెల 5న చికిత్స పొందుతూ అంజి మృతి చెందారు. వారం రోజులుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాముడు కూడా గురువారం మృతి చెందారు. అన్నా, తమ్ముడు మృతి చెందడం పట్ల ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


అటు పదోన్నతి.. ఇటు మృత్యువు


  1. కొవిడ్‌తో పశువైద్య నిపుణుడి మృతి
  2. డీడీగా పదోన్నతి వచ్చిన రోజునే..

బనగానపల్లె, మే 13: ఆస్పత్రి బెడ్‌పై కొన్ని రోజులుగా ఆయన కొవిడ్‌తో పోరాటం చేస్తున్నారు. కోలుకోలేక కన్నుమూసే సమయంలోనే ఆయనకు పదోన్నతి లభించింది. ఆ విషయం తెలియకముందే ప్రాణాలు విడిచారు. మండల పశువైద్యసహాయ సంచాలకులు డాక్టర్‌ వెంకటరమణ వర్మ(57) కొవిడ్‌తో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతి చెందారు. గత పదేళ్లుగా బనగానపల్లె పశువైద్యశాలలో సేవలందిస్తున్న ఆయన, రైతుల మన్ననలు పొందారు. ఆస్పత్రికి వెళితే ఆప్యాయంగా పలుకరించే ఆయన మృతిచెందారని తెలిసి పలువురు పాడిరైతులు ఆవేదన చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయన కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు మృతి చెందిన రోజే డిప్యూటీ డైరక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మృతికి బనగానపల్లె, అవుకు మండల పశువైద్యులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కొలిమిగుండ్ల మండల ప్రత్యేక అధికారిగా కూడా ఆయన సేవలందించి, అందరి మన్ననలు పొందారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. 


కరోనా బాధితులు బయటకు రాకూడదు: జేసీ

కర్నూలు(హాస్పిటల్‌), మే 13: కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులు బయటకు రాకూడదని జేసీ రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాలోని వైద్యాధికారులకు, ప్రోగ్రాం అధికారులతో జేసీ కొవిడ్‌-19పై టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హోం ఐసొలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులకు కిట్లు అందించాలని ఆదేశించారు. పాజిటివ్‌ బాధితుడు బయట తిరిగితే స్థానిక పోలీసు అధికారుల సహాయంతో కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించాలన్నారు. 


ఆసుపత్రికి వచ్చిన కాసేపటికే..


  1. ఊపిరాడక మహిళ మృతి
  2. నాలుగు రోజులుగా టైఫాయిడ్‌కి వైద్యం


కోసిగి, మే 13: భర్త, కుమారుడితో కలిసి చికిత్స కోసం కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ, కాసేపటికే ఊపిరి ఆడక మృతిచెందారు. మండల పరిధిలోని చిర్తనకల్‌ గ్రామానికి చెందిన సంజపోగు బుజ్జమ్మ (45), తన భర్త స్వామిదాస్‌, కుమారుడు ప్రేమ్‌ కుమార్‌తో కలిసి గురువారం ఆసుపత్రికి వచ్చారు. కాసేపటికే ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలాగా ఆసుపత్రి బెడ్డు మీదే ప్రాణాలు వదిలారు. టైఫాయిడ్‌తో నాలుగు రోజుల నుంచి ఇబ్బంది పడుతోందని, ఆర్‌ఎంపీలు, ఆదోనిలోని వైద్యుల వద్ద చికిత్స చేయించామని స్వామిదాస్‌ తెలిపారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని తెలిపారు. వచ్చిన కొద్దిసేపటికే ఆయాసం ఎక్కువైందని, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్పిన కొద్దినిమిషాల్లోనే మృతి చెందిందని భోరున విలపించాడు. వచ్చిన వెంటనే తన తల్లికి ఆక్సిజన్‌ ఏర్పాటు చేసుంటే తన తల్లి బతికేదేమోనని ప్రేమ్‌ కుమార్‌ కంటతడి పెట్టాడు. ఆస్పత్రికి వచ్చిన మహిళ ఏ కారణం చేత మృతిచెందారో తమకు అర్థం కావడం లేదని, ఏఎన్‌ఎం ద్వారా వివరాలు సేకరించి, ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తామని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కీర్తిప్రియ తెలిపారు.

Updated Date - 2021-05-14T06:23:16+05:30 IST