ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2020-04-10T09:16:14+05:30 IST

జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు మండలాల్లోని అరటి, ఉద్యాన పంటలకు అపారనష్టం జరిగింది. అరటి

ఈదురుగాలుల బీభత్సం

నేలకూలిన 1,360 ఎకరాల అరటి

మొత్తం 2663 హెక్టార్లలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు

కరోనా కష్టాలకు గాలుల నష్టం తోడు


వేంపల్లె / వేముల / రైల్వేకోడూరు / రాజంపేట / ఓబులవారిపల్లె / వీరపునాయునిపల్లె / పెండ్లిమర్రి, ఏప్రిల్‌ 9: జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు మండలాల్లోని అరటి, ఉద్యాన పంటలకు అపారనష్టం జరిగింది. అరటి కోతకు సిద్ధంగా ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో వీచిన ఈదురుగాలులు అరటి చెట్లను నేలకూల్చాయి. పడిపోయిన చెట్లకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కోతకు సిద్ధంగా ఉన్న అరటి గెలలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


జిల్లా వ్యాప్తంగా ఒక్క గురువారం వీచిన గాలులకే సుమారు 1021 ఎకరాల్లో అరటి ఎకరాల్లో అరటి నేలకూలింది. రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో అరటి, మామిడి, తమలపాకు, మునగ పంటలు 2663.60 హెక్టార్లలో కుప్పకూలాయి. 3045 మంది రైతులు రూ.39.95 కోట్లు నష్టపోయారని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మఽధుసూధన్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. 


వేంపల్లె మండలం నందిపల్లె, కత్తులూరు, వెలమవారిపల్లె, చింతలమడుగుపల్లె, వేంపల్లె, కుమ్మరాంపల్లె తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో అరటి చెట్లు విరిగిపోయాయి. వేముల మండలంలో వేముల, బచ్చయ్యగారిపల్లె, వి కొత్తపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, మీదిపెంట్ల, మబ్బుచింతలపల్లె తదితర గ్రామాల్లో 200ఎకరాలకుపై పంటనష్టం జరిగింది. రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో 150 ఎకరాలు దెబ్బతిన్నాయి. ఈ మండలంలో మొత్తం 370 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి.


రాజంపేట పట్టణంలో గురువారం వీచిన భారీ ఈదురుగాలులతో పండ్లతోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొండ్లోపల్లె, ఊటుకూరు ప్రాంతాల్లో సుమారు 100ఎకరాల పైబడి అరటిపంట నేల మట్టమైంది. ఓబులవారిపల్లె మండలంలో బి.కమ్మపల్లె, బి.పి.రాచపల్లె, బొమ్మవరం గ్రామాల్లో 80ఎకరాల్లో అరటితోటలు నేలమట్టమయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని ఎన్‌.పాలగిరి, కదిరేపల్లె, తాటిమాకులపల్లె, యు రాజుపల్లె, గోనుమాకులపల్లె తదితర గ్రామాల్లోని 210 ఎకరాల్లో, పెండి ్లమర్రి మండలంలో దాదాపు 100 ఎకరాలకు పైగా అరటి తోటలపై ఈదురుగాలుల ప్రభావం చూపింది.


పది లక్షలు నష్టపోయాం..వెంకటసుబ్బయ్య, రైతు, తంగేడుపల్లె గ్రామం, పెండ్లిమర్రి మండలం

పదెకరాల్లో పంటను సాగు చేశాం. పంట బాగా దిగుబడి వచ్చిందన్న సంతోషం ఉండగానే కరోనా రూపంలో సమస్య వచ్చిపడింది. టన్ను రూ.10వేల పైచిలుకు ధర ఉండే అరటికి కరోనా ప్రభావం వల్ల టన్ను రూ.2వేలకు దిగి వచ్చింది. సాగు పెట్టుబడి అయినా వస్తుందనే ఆశతో ఉండగానే హఠాత్తుగా ఈదురుగాలులతో అరటి నేలకొరిగింది. కరోనా మహమ్మారి, ఈదురుగాలులతో రూ.10 లక్షలు నష్టపోయా.


ఉద్యానపంటల నష్టం వివరాలు

పంటలు హెక్టార్లు రైతులు నష్టం విలువ 

అరటి 1021.60 1198 15.32 కోట్లు

మామిడి 1635.00 1840 24.53 కోట్లు

తమలపాకులు    5    5 00.05 కోట్లు

మునగ    2    2 00.03 కోట్లు


మొత్తం 2663.60 3045 39.95 కోట్లు

Updated Date - 2020-04-10T09:16:14+05:30 IST