ఏడేళ్లలో తెలంగాణాకు 13,295 కోట్ల ఉపాధి నిధులు

ABN , First Publish Date - 2021-07-28T08:38:30+05:30 IST

గడచిన ఏడేళ్లలో తెలంగాణాకు రూ.13,295 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు.

ఏడేళ్లలో తెలంగాణాకు 13,295 కోట్ల ఉపాధి నిధులు

  • ఉపాధి నిధుల మళ్లింపు మా దృష్టికి రాలేదు 
  • తెలంగాణలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు
  • 694.96 కోట్ల వరద సాయం ఇచ్చాం: కేంద్ర మంత్రులు


న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గడచిన ఏడేళ్లలో తెలంగాణాకు రూ.13,295 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఎంపీ బండి సంజయ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏటా సగటున 42 లక్షల మందికి చొప్పున ఏడేళ్లలో 3.32 కోట్ల మందికి ఉపాధి కల్పించామని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 3.94 లక్షల మందికి రూ.268 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. తెలంగాణలో ఉపాధి హామీ నిధులు మళ్లించినట్లు తమ దృష్టికి రాలేదని మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి స్పష్టం చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 2018లో ఆత్మహత్యలు 900కు పెరిగాయని, అయితే ఆ తర్వాత ఏడాది 2019లో 491కు తగ్గాయని స్పష్టం చేశారు. తెలంగాణలో గత మూడేళ్ల కాలంలో 53 కస్టోడియల్‌ మరణాలు సంభవించాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.


గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో జరిగిన నష్టానికి గాను రూ. 694.96 కోట్లు ఇచ్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. తెలంగాణలో సరిపడా ఎరువులున్నాయని కేంద్ర మంత్రి మన్షుక్‌ మాండవీయ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రిబదులిచ్చారు. కాగా, జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు కలిగే నష్టాలను భర్తీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున 2017 జూలై నుంచి ఇప్పటివరకు రూ.3,88,908 కోట్ల మేరకు పరిహారం చెల్లించినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో బండ ప్రకాశ్‌ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. తెలంగాణకు ఇప్పటి వరకు రూ.6,218 కోట్ల పరిహారం చెల్లించగా, ఏపీకి రూ.6,427 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-07-28T08:38:30+05:30 IST