ఆగస్టు 15 లోగా 131 బస్తీ దవాఖానాలు

ABN , First Publish Date - 2022-06-23T08:48:51+05:30 IST

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 131 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 15 లోగా 131 బస్తీ దవాఖానాలు

390 దవాఖానాలు  వినియోగంలోకి రావాలి:మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 131 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానాలపై మంత్రి బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 259 బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయన్నారు. మొత్తం 390 దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలన్నారు. ఇప్పటికే సిద్థమైన 12 బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించాలని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారాను బస్తీ దవాఖానాల సేవలందించాలని, టెలి కన్సల్టేషన్‌ సేవలనూ పెంచాలన్నారు. టీ డయాగ్నొస్టిక్‌ సహకారంతో ఎక్కడిక్కడే శాంపిళ్ల సేకరణ జరగాలని, రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని సూచించారు. ఒకవైపు బస్తీ దావాఖనాలు, మరో వైపు టి డయాగ్నొస్టిక్‌ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు ఉచిత  మందులు ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పుతుందని చెప్పారు.


బ్రిటిష్‌ హై కమిషనర్‌తో మంత్రి భేటీ

బ్రిటిష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, ఇంటర్నేషనల్‌ హస్పిటల్స్‌ గ్రూప్‌ సీఈవో చేస్టర్‌ కింగ్‌, సీవోవో సైమన్‌ ఆశ్వర్త్‌, భారత్‌ నుంచి ప్రతినిధి పృథ్వి సహాని బుధవారం మంత్రి హరీశ్‌రావును కలిశారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ ప్రతినిధులు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, టిమ్స్‌, మెడికల్‌ కాలేజీలు, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర అంశాల గురించి మంత్రి వారికి వివరించారు. 

Updated Date - 2022-06-23T08:48:51+05:30 IST