Abn logo
Sep 27 2021 @ 15:11PM

తుమకూరు మఠం నూతన అధిపతిగా 13 ఏళ్ల బాలుడు

తుమకూరు : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న కుప్పూరు గడ్డుగే సంస్థాన మఠం నూతన అధిపతిగా ఓ పదమూడేళ్ళ బాలుడిని ఆదివారం ఎంపిక చేశారు. ఈ మఠం అధిపతిగా వ్యవహరించిన యతీశ్వర శివాచార్య స్వామి శనివారం పరమపదించడంతో ఆయనకు వారసునిగా ఈ బాలుడిని నియమించారు. చిక్కనాయకనహళ్ళి తాలూకాలో ఈ మఠం ఉంది. 


కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధు స్వామి మీడియాతో మాట్లాడుతూ, యతీశ్వర శివాచార్య స్వామివారి ఆకాంక్షల మేరకు పదమూడేళ్ళ బాలుడు తేజస్‌ను తదుపరి మఠాధిపతిగా నియమించినట్లు తెలిపారు. 500 సంవత్సరాల చరిత్రగల వీరశైవ మఠాన్ని తన తర్వాత తన మేనల్లుడు నడిపిస్తాడని యతీశ్వర శివాచార్య స్వామి చెప్పారని తెలిపారు. 


కుప్పూరు గడ్డుగే మఠం అర్చకుడు బీఆర్ గిరీశ్ మాట్లాడుతూ, కామ సముద్రలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తేజస్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. మఠాధిపతిగా విధులను నిర్వహిస్తూనే తేజస్ చదువును కొనసాగిస్తాడని చెప్పారు. 


ఈ మఠంలో నివసించే మహేశ్, కాంతామణి దంపతుల బిడ్డ తేజస్. మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు తేజస్ అంగీకరించినట్లు మఠం అధికారులు, కుటుంబ సభ్యులు చెప్పారు. 500 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబానికి చెందినవారు ఈ మఠానికి అధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


యతీశ్వర శివాచార్య స్వామి కోవిడ్-19తో బాధపడుతుండగా తుమకూరులోని సిద్ధ గంగ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయించారు. ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో పరమపదించారు.