13 లక్షలు దాటేశాయ్‌

ABN , First Publish Date - 2021-05-11T08:43:20+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు 13 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం తగ్గలేదు

13 లక్షలు దాటేశాయ్‌

రాష్ట్రంలో కొత్తగా 14,986 కేసులు.. 84 మంది మృత్యువాత

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి కరోనా.. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి కూడా

1,89,367 యాక్టివ్‌ కేసులు.. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మృతి

24 గంటల్లో 84 మంది మృత్యువాత


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా కేసులు 13 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం తగ్గలేదు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 60,124 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 14,986 మందికి పాజిటివ్‌ వచ్చిందని, కరోనాతో 84 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 13,02,589కి, మొత్తం మరణాల సంఖ్య 8,791కి చేరుకుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 2,352 మందికి వైరస్‌ సోకగా.. విశాఖపట్నంలో 1,618, గుంటూరులో 1,575, చిత్తూరులో 1,543, నెల్లూరులో 1,432, శ్రీకాకుళంలో 1,298, కడపలో 1,224, కర్నూలులో 948, కృష్ణాలో 666, ప్రకాశంలో 639, అనంతపురంలో 639, విజయగనరంలో 629, పశ్చిమగోదావరిలో 423 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 16,167 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. రికవరీల సంఖ్య 11,04,431కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కారణంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున మరణించగా.. తూర్పుగోదావరిలో 10, విశాఖలో 9, నెల్లూరు, విజయనగరం 8 మంది చొప్పున, చిత్తూరు, కర్నూలులో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున చనిపోయారు. 


ఆస్పత్రిలో చేరిన డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆమె భర్త, అరకు పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజుకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కురుపాం సీహెచ్‌సీలో ఆదివారం వీరిద్దరూ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో సోమవారం విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 


హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్యే శ్రీదేవి

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె బావ  కుమారుడు వంశీధర్‌రెడ్డికి మూడు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులు కర్నూలులో పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో శ్రీదేవికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె హైదరాబాద్‌లో హోంక్వారంటైన్‌లో ఉండి చిక్సిత పొందుతున్నారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌, సిబ్బంది సోమవారం కరోనా పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్‌ వచ్చింది. 


కుదుట పడుతున్న స్పీకర్‌ ఆరోగ్యం

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆరోగ్యం కుదుటపడుతోంది. పది రోజులుగా స్పీకర్‌, ఆయన సతీమణి, కుమారుడు శ్రీకాకుళం మెడీకవర్‌ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. స్పీకర్‌ స్థాయి వ్యక్తి పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో కిత్స పొందుతున్నా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఎటువంటి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయడం లేదు. అయితే స్పీకర్‌కు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, బుధవారం డిశ్చార్జి చేస్తారని తెలిసింది.


‘ఔట్‌సోర్సింగ్‌’ ఎండీ ప్రభాకర్‌ మృతి

కడప రిమ్స్‌లో కరోనా వైర్‌సతో చికిత్స పొందుతున్న ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రభాకర్‌ (48) ఆదివారం సాయంత్రం మృతిచెందారు. రైల్వేకోడూరుకు చెందిన ప్రభాకర్‌ వారం క్రితం కరోనాతో రిమ్స్‌లో చేరారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

Updated Date - 2021-05-11T08:43:20+05:30 IST