అర్ధరాత్రి సీఎంకు ఫోన్.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు 14మంది యువతుల ‘లాక్‌డౌన్’ జర్నీ

ABN , First Publish Date - 2020-03-27T19:35:26+05:30 IST

‘ఎక్కడో విదేశాల్లో ఉండే వాళ్లను ప్రత్యేక విమానాల్లో రప్పించి హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.. మేం హైదరాబాద్ నుంచే వస్తున్నాం.. మమ్మల్ని మా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించరు..’

అర్ధరాత్రి సీఎంకు ఫోన్.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు 14మంది యువతుల ‘లాక్‌డౌన్’ జర్నీ

హైదరాబాద్/కేరళ: ‘ఎక్కడో విదేశాల్లో ఉండే వాళ్లను ప్రత్యేక విమానాల్లో రప్పించి హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.. మేం హైదరాబాద్ నుంచే వస్తున్నాం.. మమ్మల్ని మా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించరు..’ ఇదీ.. ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న వేలాది మంది సంధిస్తున్న ప్రశ్న.. కోచింగ్‌ తీసుకోవడం కోసమో.. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనో.. హైదరాబాద్‌లోని హాస్టళ్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. లాక్‌డౌన్ వల్ల హాస్టళ్లు మూసేస్తుండటంతో వారంతా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. అలా వెళ్లిన ఏపీ వాసులను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. దీంతో వేలాది మంది రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి.. అచ్చం ఇలాంటి సమస్యే... 14 మంది కేరళ యువతులకు ఎదురైంది.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ఓ టెంపో కారులో బయల్దేరిన వారు.. గమ్యం చేరుకోకుండానే ప్రధాని నుంచి లాక్‌డౌన్ ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి నుంచి అంతా బంద్ అని ప్రధాని చెప్పడంతో ఎక్కడికక్కడ వారికి దారులు మూసుకుపోయాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఏకంగా కేరళ సీఎం నివాసానికే వారు ఫోన్ చేశారు. అంత రాత్రి సమయంలోనూ రెండు రింగ్స్‌కే ఫోన్ లిఫ్ట్ చేసిన కేరళ సీఎం పినరయి విజయన్.. వారి సమస్యను అర్థం చేసుకుని యువతులను వారి వారి సొంతూళ్లకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వీరీలో అథిరా షాజీ అనే ఓ యువతి ఇంటికి చేరాక.. తన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్.. అందరి హృదయాలను హత్తుకుంటోంది.. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.. ఆమె పెట్టిన పోస్ట్.. యథాతథంగా.. 


‘మేం 14 మంది అమ్మాయిలం.. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన వాళ్లం.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. అక్కడే వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో ఉంటున్నాం.. జనతా కర్ఫ్యూ తర్వాత హాస్టల్‌ను ఖాళీ చేయాల్సిందిగా యజమాన్యం నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నుంచి కోజికోడ్‌కు వెళ్లేందుకు మేమంతా ఓ టెంపో కారును మాట్లాడుకున్నాం. 24వ తారీఖున ఉదయం 7గంటల సమయంలో మేమంతా హైదరాబాద్ నుంచి బయల్దేరాం.. ‘రేపు తెల్లారేలోగా ఇంట్లో ఉంటాం.. ఈ వైరస్ భయం తగ్గాక మళ్లీ ఉద్యోగానికి రావచ్చులే..’ అని అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం.. కానీ ఉన్నట్టుండి ఆ రోజు రాత్రి 8గంటల సమయంలో ప్రధాని నుంచి వచ్చిన లాక్‌డౌన్ ప్రకటనతో మా నెత్తిన పిడుగుపడ్డట్లయింది.. ఈ అర్ధరాత్రి నుంచి అంతా బంద్ అని ప్రధాని చెప్పడంతో మాలో టెన్షన్ పెరిగిపోయింది.. ప్రయాణంలో ఉన్న తాము ఈ అర్ధరాత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటామో కూడా తెలీని పరిస్థితి.. మా ఇళ్లకు ఫోన్ చేసినా..  తెలిసిన అధికారులకు ఫోన్ చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.. డ్రైవర్‌నే సాధ్యమయినంత వేగంగా పొమ్మని చెప్పాం.. 



( అథిరా షాజీ ఫేస్‌బుక్ పోస్ట్ కోసం క్లిక్ చేయండి..)


ఆ డ్రైవర్ కూడా.. ‘నేను తిరిగి హైదరాబాద్‌కు రావడానికి ఇబ్బంది అవుతుంది మేడమ్. ముతుంగా దగ్గర దింపేస్తాను..’ అని అన్నాడు.. అది ఫారెస్ట్ ఏరియా.. అంత రాత్రి సమయంలో అది సురక్షితమైన ప్రాంతం కాదని అనిపించడంతో తోల్పెట్టీ వరకు తీసుకెళ్లమన్నాం.. ఈ లోపు ఫోన్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం.. పొద్దుటి నుంచి నీళ్లు తాగడం తప్ప ఏమీ తినకపోవడం వల్ల అప్పటికే నీరసించిపోయాం.. అర్ధరాత్రి మాకు సాయం చేసే వాళ్లు లేక.. మేం దిగాల్సిన ప్రాంతం దగ్గరకు వస్తున్న కొద్దీ మాలో భయం పెరిగిపోసాగింది. ఇంతలో ఓ స్నేహితురాలు.. ముఖ్యమంత్రికి మన సమస్యను చెబుదాం అని అన్నది.. ఆమె చెప్పింది కరెక్టే.. ఆ సమయంలో మాకు సాయం చేసి.. మమ్మల్ని సొంతూళ్లకు చేర్చగలిగేది సీఎం ఆదేశాలు మాత్రమే.. కానీ ఎలా..? మాకు తెలిసిన అధికారుల ద్వారా ప్రయత్నించాం.. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.. చివరకు గూగుల్‌లో సెర్చ్ చేశాం.. మొత్తానికి మాకు సీఎం అధికారిక నివాస ల్యాండ్ లైన్ నెంబర్ దొరికింది. 


అసలు ఆ నెంబర్ కరెక్టేనా... లేక ఫేక్ నెంబరా..? ఇంత అర్ధరాత్రి సమయంలో సీఎం స్పందిస్తారా..? ఈ టైమ్‌లో ఫోన్లేంటి అని తిడతారా..? అని మాలో మేమో భయపడుతూనే ఆ నెంబర్‌కు ఫోన్ చేశాం.. షాక్.. రెండు రింగ్స్‌కే ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలిసి మరింత షాక్ అయ్యాం.. ఏకంగా సీఎం పినరయి విజయన్‌ గారు మాట్లాడుతున్నారు.. ఓ వైపు భయపడుతూనే మా సమస్య ఏంటో.. ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయామో చెప్పాం.. మేం చెప్పేది అంతా ఆయన సావధానంగా విన్నారు.. ఆ తర్వాత ‘మీరేం భయపడకండి.. మిమ్మల్ని మీమీ ఇళ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత నాది.. మీకు కలెక్టర్, ఎస్పీ ఫోన్ నెంబర్ ఇస్తాను. వారికి నేను కూడా ఫోన్ చేసి చెబుతాను. మీరు వారికి కాంటాక్ట్ అవండి..’ అని చెప్పి సీఎం గారు ఫోన్ పెట్టేశారు. కొద్ది క్షణాలకే నా ఫోన్ నెంబర్‌కు వయనాడ్ కలెక్టర్, ఎస్పీ నెంబర్లు వచ్చాయి. నేను వెంటనే వయనాడ్ ఎస్పీకి ఫోన్ చేశాను. ఆయనకు విషయమంతా చెప్పాను.


‘తోల్పెట్టీ వరకు రండి.. మీరు అక్కడికి వచ్చే లోపు నేను అన్ని ఏర్పాట్లు చేస్తా..’ అని ఎస్పీ చెప్పారు.. మేం తోల్పెట్టీ చేరుకునేలోపే... అక్కడికి తిరునెల్లి ఎస్సై ఏయూ జయప్రకాశ్ ఓ వాహనంతో పాటు ఓ వైద్య బృందంతో సహా వేచిచూస్తున్నారు. పోలీసు వాహనాన్ని చూసిన తర్వాత మాలో ఆశలు చిగురించాయి. మేం మా ఇళ్లకు చేరుకుంటామన్న నమ్మకం ఏర్పడింది.. కారులోంచి దిగాక మాకు వాళ్లు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని.. కుటుంబ సభ్యులతోనూ సన్నిహితంగా మెలగవద్దని డాక్టర్లు సూచించారు. పోలీసులు ఏర్పాటు చేసిన వాహనాల్లో మమ్మల్ని మా ఇళ్లకు చేర్చారు. 25వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 11గంటలకు మేమంతా మా ఇళ్లకు చేరుకున్నాం.. ‘కేరళ ప్రభుత్వం మీతో ఉంది.. మీ కష్టాల్లో మీకు అండగా ఉంటుంది..’ అన్న విషయాన్ని నేను నమ్మకంగా చెప్పగలను..’ అని అథిరా షాజీ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఈ పోస్ట్‌కు వెయ్యి షేర్లు.. వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. 

Updated Date - 2020-03-27T19:35:26+05:30 IST