శ్రీనగర్‌లో జాతి వ్యతిరేక నినాదాలు: 13 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-04-10T01:47:16+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా జాతి వ్యతిరేక, రెచ్చగొట్టే నినాదాలు చేసిన..

శ్రీనగర్‌లో జాతి వ్యతిరేక నినాదాలు: 13 మంది అరెస్టు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా జాతి వ్యతిరేక, రెచ్చగొట్టే నినాదాలు చేసిన 13 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మసీదులో ప్రార్థనలు ముగిసిన వెంటనే సుమారు డజను మంది వ్యక్తులు అక్కడకు చేరుకుని జాతి వ్యతిరేక నినాదాలు చేశారు. మరో ఇద్దరు కూడా వారికి తోడయ్యారు. ఆ సమయంలో ప్రార్థనలకు అత్యథిక స్థాయిలో 24,000 మంది హాజరయ్యారు. నినాదాలు చేస్తున్న వారిని వలంటీర్లు మసీదు బయటకు పంపించినప్పటికీ వారు గేటు బయటే రెండు, మూడు నిమిషాల పాటు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. ఇంతలోనే పోలీసుల రాక గమనించి వారు హుటాహుటిన అక్కడి నుంచి జారుకున్నారు.


కాగా, నినాదాలకు పాల్పడిన అగంతకులపై ఐపీసీలోని సెక్షన్ 124ఎ, సెక్షన్ 447 కింద నౌహట్టా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు జరిపారు. ఈ ఘటనకు ప్రధాన బాధ్యులుగా ఇనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని నౌహట్టాకు చెందిన బషరత్ నబి భట్, ఉణర్ మంజూర్ షేక్‌గా గుర్తించారు. అనంతరం మరో 11 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.


ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల ఆదేశాలతో ముందస్తు వ్యూహంతోనే కుట్రకు ప్లాన్ జరిగింది. శుక్రవారం ప్రార్థనలకు అడ్డుతగలడం, హాజరైన వారిని రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే వ్యూహం ఉందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. పౌరులు ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్రంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా జాతివ్యతిరేక, టెర్రరిస్టు ఎజెండా అమలు కోసం ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకునే ప్రయత్నాలను ఏమాత్రం సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2022-04-10T01:47:16+05:30 IST