నిఫా వైరస్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి, హుటాహుటిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-09-05T20:57:13+05:30 IST

కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో నిఫా వైరస్ కేసు వెలుగుచూడటంతో కేంద్రం..

నిఫా వైరస్‌తో 12 ఏళ్ల బాలుడు మృతి, హుటాహుటిన కేంద్ర బృందం

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో నిఫా వైరస్ కేసు వెలుగుచూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. హుటాహుటిన కేంద్ర బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. నిఫా వైరస్‌తో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 12 ఏళ్ల బాలుడు మృతిచెందడం కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం తీవ్రజ్వరంతో మిమ్స్ (ఎంఐఎంఎస్) ఆసుపత్రిలో చేరిన బాలుడు శనివారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. నిఫా వైరస్‌తో బాలుడు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ధ్రువీకరించారు. కోవిడ్‌తో రావడంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, మూడు శాంపుల్స్ కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని చెప్పారు.


''పిల్లవాడి కుటుంబ సభ్యులెవరికీ నిఫా లక్షణాలు లేవు. కుటుంబ బంధువులను అబ్జర్వేషన్‌లో ఉంచాం. పిల్లవాడిని ఎవరెవరు కలుసుకున్నారో ఆరా తీస్తున్నాం. కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి, కన్నూరు, కోజికోడ్ జిల్లాలను అప్రమత్తం చేశాం' అని ఆమె తెలిపారు. కాగా, ఎవరికైనా వాంతులు, జ్వరం, నిఫా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ప్రస్తుతానికైతే భయపడాల్సిందేమీ లేదని, జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని తెలిపింది.

Updated Date - 2021-09-05T20:57:13+05:30 IST