రూ.1.26 కోట్ల విలువైన సారా, మద్యం ధ్వంసం

ABN , First Publish Date - 2022-08-17T06:57:38+05:30 IST

ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన అక్రమ నాటుసారా నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, తయారీదారులపై పీడీ యాక్ట్‌ కేసులు, జిల్లా బహిష్కరణతో ఉక్కుపాదం మోపుతున్నట్టు ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు తెలిపారు.

రూ.1.26 కోట్ల విలువైన సారా, మద్యం ధ్వంసం
మద్యం బాటిల్స్‌ను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేస్తున్న ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు.

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 16: ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన అక్రమ నాటుసారా నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, తయారీదారులపై పీడీ యాక్ట్‌ కేసులు, జిల్లా బహిష్కరణతో ఉక్కుపాదం మోపుతున్నట్టు ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు తెలిపారు. పోలీసుశాఖ, ఎస్‌ఈబీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ రూరల్‌ నేమాం బీచ్‌లో వివిధ కేసుల్లో పోలీసులు, ఎస్‌ఈబీ స్వాధీనం చేసుకున్న 2926 కేసులకు చెందిన రూ.1.20 కోట్ల విలువైన 59,643 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. అలాగే రూ.6 లక్షల విలువైన 3,940 మద్యం సీసాలను బుల్‌డోజర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా, అక్రమమద్యం రవాణా నిర్మూలన కోసం ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా ఎస్‌ఈబీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో పోలీసులు, ఎస్‌ఈబీలు సంయుక్తంగా దాడులు నిర్వహించి పెద్దఎత్తున నాటుసారా, అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్టవేశామన్నారు. అలాగే పెద్దఎత్తున దాడు లు నిర్వహించి లక్షలాది లీటర్ల నాటుసారా, మద్యం బాటిళ్లు సీజ్‌ చేశామన్నారు. నాటుసారా తయారీదారులకు పరివర్తన కార్యక్రమం కింద ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. తరచూ సారా కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైలుకు పంపిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 9 మందిపై పీడీ యాక్ట్‌ పెట్టి రాజమహేంద్రవరం జైలుకు పంపడం జరిగిందన్నారు. ఇంకొక ఐదారుగురిపై పీడీయాక్ట్‌కు రికార్డులు సిద్ధం చేశామన్నారు. నాటుసారా తయారీ కారణంగా ప్రజలు అనారోగ్యం పాలై, చావుకు దారితీస్తున్నట్టు తెలిపారు. ఇంతటి దారుణానికి దారితీస్తున్న నాటుసారా తయారీకి పాల్పడే వారిపైన, ప్రోత్సహించిన వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  ఏఎస్పీ అడ్మిన్‌ పి.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌ఈబీ యం. జయరాజు సమక్షంలో లీగల్‌ ప్రోసీజర్‌ పూర్తి అయిన తర్వాత పెద్ద మొత్తంలో సారా, అక్రమ మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రాందేవు సూర్యప్రకాశరావు (చిన్న), ఎస్‌బీ డీఎస్పీలు అంబికా ప్రసాద్‌, ఎం. వెంకటేశ్వరరావు, రూరల్‌ సర్కిల్‌ సీఐ శ్రీనివాస్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-17T06:57:38+05:30 IST