Abn logo
Apr 14 2021 @ 00:47AM

వారానికి రూ.12,575 కోట్లు

మినీ లాక్‌డౌన్‌ నష్టంపై బార్‌క్లేస్‌ అంచనా  క్యు1 జీడీపీకి 1.4 శాతం గండి 

వృద్ధి అంచనా కుదించిన గోల్డ్‌మన్‌ శాచ్‌


దేశంలో మరోసారి వైరస్‌ స్వైరవిహారం చేయడం ఆర్థిక రంగానికి అశనిపాతంగా మారనుంది. గత ఏడాది సుదీర్ఘ కాలం పాటు అమలులో ఉన్న లాక్‌డౌన్ల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక రంగం మరోసారి సందిగ్ధ స్థితిలో పడింది. మహారాష్ట్రలో తాజాగా ప్రకటించిన కఠిన ఆంక్షలతో కూడిన సెమీ లాక్‌డౌన్‌, కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రధాన రాష్ర్టాల్లో కూడా రాత్రి వేళ అమలులో ఉన్న కర్ఫ్యూ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని రేటింగ్‌ సంస్థలంటున్నాయి.


ముంబై: కరోనా మలి విడత ఉధృతిని కట్టడి చేసేందుకు పలు రాష్ర్టాల్లో అమలులో ఉన్న ఆంక్ష లు, మినీ లాక్‌డౌన్ల ప్రభావం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వారానికి 125 కోట్ల డాలర్ల (రూ.12,575 కోట్లు) మేర కు నష్టపోవచ్చునని బ్రిటిష్‌ ఆర్థిక సేవల దిగ్గజం బార్‌క్లేస్‌ హెచ్చరించింది. జూన్‌తో ముగియనున్న తొలి త్రైమాసిక  జీడీపీకి 1.40 శాతం మేర గండిపడవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది.  ప్రస్తుత ఆంక్షలు మే నెలాఖరు వరకు కొనసాగితే, జీడీపీకి 0.34 శాతం లేదా 1,050 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లవచ్చని బార్‌క్లేస్‌  అంటోంది. 


వృద్ధి అంచనా యథాతథం 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా నమోదుకావచ్చన్న గత అంచనాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు బార్క్‌లేస్‌ పేర్కొం ది. ప్రస్తుత ఆంక్షలను మరింత పెంచడం లేదా ఆర్థికంగా కీలకమైన అన్ని ప్రాంతా ల్లో ఆంక్షలు విధించిన పక్షంలో మాత్రం వృద్ధి అంచనాల కంటే తగ్గవచ్చని హెచ్చరించింది. 


జీవీఏ 0.32% తగ్గొచ్చు: కేర్‌ రేటింగ్స్‌ 

స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 16 శాతం మేర దోహదపడుతున్న మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగితే ఉత్పత్తికి విఘాతమేనని ఈమధ్య కేర్‌ రేటింగ్స్‌ కూడా హెచ్చరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు స్థూల విలువ జోడింపునకు (జీవీఏ) 0.32 శాతం మేర గండిపడవచ్చని అంచనా వేసింది. నెలకు జీవీఏ నష్టం రూ.40,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని, ఆంక్షలు దీర్ఘకాలంపాటు కొనసాగితే, ఉత్పత్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 


వృద్ధి అంచనా 10.5 శాతమే : గోల్డ్‌మన్‌ శాచ్‌

ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 10.9 శాతం నుంచి 10.5 శాతానికి తగ్గిస్తున్నట్లు గోల్డ్‌మన్‌ శాచ్‌ తెలిపింది. వృద్ధి రేటుతోపాటు స్టాక్‌ మార్కెట్‌ పనితీరు అంచనాల్లోనూ కోత పెట్టింది. ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి నిఫ్టీ టార్గెట్‌ను గతంలో అంచనా వేసిన 16,500 స్థాయి నుంచి 16,300కు తగ్గించింది.  


రెండంకెల వృద్ధి పక్కా: మూడీస్‌ 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు స్థానికంగా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో భారత జీడీపీకి ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ఈసారి వృద్ధి రేటు మాత్రం రెండంకెల స్థాయిలోనే నమోదుకానుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అభిప్రాయపడింది. గత ఏడాది జీడీపీ వృద్ధి రుణాత్మక స్థాయికి పడిపోవడం వల్ల ఏర్పడిన ‘లో బేస్‌ ఎఫెక్ట్‌’ ఇందుకు కారణమని పేర్కొంది. 


ఈ-కామర్స్‌ సేవలకు పెరిగిన డిమాండ్‌ 

ప్రజల సంచారంపై ఆంక్షల ప్రభావం వల్ల ఈ-కామర్స్‌ సేవలకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌ కామర్స్‌ కంపెనీలు తమ డెలివరీ బాయ్స్‌, తదితర ఉద్యోగులను వైరస్‌ బారి నుంచి కాపాడుకోవడంతోపాటు కస్టమర్లకు ఆర్డర్లను సురక్షితంగా చేరవేసే చర్యలను ముమ్మరం చేశాయి.


గడిచిన కొన్ని వారాల్లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కిరాణా సరుకులు, శానిటైజర్లు, మాస్క్‌లు, పుస్తకాలు, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు, గృహ ఉపకరణాలకు ఆర్డర్లు గణనీయంగా పెరిగాయని ఇండస్ట్రీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మార్కెట్లలోనైతే డిమాండ్‌ 60 శాతం మేర పెరిగిందట. తినడానికి లేదా వంటకు సిద్ధంగా ఉన్న ఆహారానికి డిమాండ్‌ 80 శాతం పెరగగా.. శీతలీకరించిన ఆహారానికి 500 శాతం, ప్యాకేజ్డ్‌ పాలు, పాల ఉత్పత్తులకు గిరాకీ 150 శాతం పుంజుకుందని గ్రోఫర్స్‌ ప్రతినిధి వెల్లడించారు. 

Advertisement