లండన్‌లో ఎత్తైన భవంతిలో అగ్నిప్రమాదం.. రంగంలోకి 125 మంది ఫైర్‌ఫైటర్లు

ABN , First Publish Date - 2022-07-21T17:25:29+05:30 IST

చల్లచల్లని ఐరోపా (Europe) ఖండం ఇప్పుడు ఎండలతో భగభగ మండిపోతోంది. నిప్పుల కొలిమిలా కాలిపోతోంది. యూకే(UK)లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

లండన్‌లో ఎత్తైన భవంతిలో అగ్నిప్రమాదం.. రంగంలోకి 125 మంది ఫైర్‌ఫైటర్లు

లండన్ : చల్లచల్లని ఐరోపా (Europe) ఖండం ఇప్పుడు ఎండలతో భగభగ మండిపోతోంది. నిప్పుల కొలిమిలా కాలిపోతోంది. యూకే(UK)లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక వేడిమి మధ్య చెలరేగుతున్న కార్చిచ్చులు, అగ్నిప్రమాదాలు స్థానికులను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం లండన్‌(London)లో ఓ ఎత్తైన భవంతి ‘ఊల్‌విచ్’ (Woolwich) 17వ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, భారీగా పొగ వెలువడింది. మరోవైపు అదే బిల్డింగ్‌కు ఎదురుగా ఉన్న దాదాపు ఒక హెక్టార్‌ విస్తీర్ణంలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. గడ్డి తగలబడిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. బిల్డింగ్‌లో మంటలను అదుపు చేసేందుకు 125 మంది ఫైర్‌ఫైటర్లు, 25 ఫైరింజన్లను రంగంలోకి దించింది. ఘటనా స్థలంలోనే ఉన్న స్టేషన్ కమాండర్ కేత్ సాండర్స్ మాట్లాడుతూ.. బిల్డింగ్ 17వ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగ వెలువడుతోందన్నారు. బిల్డింగ్‌పైకి ఎక్కడం ఇబ్బందికరంగా మారిందన్నారు. బిల్డింగ్ ఎదురు బ్లాక్‌‌లో తగలబడుతున్న గడ్డి కూడా తమకు ఆటంకంగా మారిందన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ఏరియల్ వ్యూ కోసం డ్రోన్లను ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. 


వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి..

దక్షిణ ఐరోపా దేశాల్లో వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో కార్చిచ్చులు విస్తరిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో అడవులు ధ్వంసమయ్యాయి. ఎండల వేడికి రైలు పట్టాలు సాగుతున్నాయి. వాటి కింద ఉన్న దుంగలు కాలిపోతున్నాయి. ఈ కారణంగా బ్రిటన్‌లో పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బడులకు సెలవులు ప్రకటించారు. బ్రిటన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బ్రిటన్‌లో వాతావరణ రికార్డుల నమోదు మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదు. 2019లో నమోదైన 38.7 డిగ్రీలే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. యూర్‌పలో ఎండలు, వడగాలులకు వాతావరణ మార్పులే కారణమని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే మరింత ముప్పు తప్పదని, భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


కబళిస్తున్న కార్చిచ్చులుఎండలు, వడగాలుల కారణంగా ఐరోపాలో గడిచిన వారం రోజుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. బ్రిటన్‌, స్పెయిన్‌ సహా అనేక దేశాల్లో కార్చిచ్చులతో లక్షల ఎకరాల్లో అడవులు ధ్వంసమయ్యాయి. కార్చిచ్చులకు వడగాలులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక దళాలకు కష్టంగా మారింది. కార్చిచ్చులు వ్యాపించే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 30 వేల మందిని తరలించినట్లు అంచనా. ఒక్క స్పెయిన్‌లోనే 1.73 లక్షల ఎకరాల్లో అడవి కాలిపోయింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇంతటి విధ్వంసం జరగలేదని అధికారులు తెలిపారు. స్పెయిన్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.

Updated Date - 2022-07-21T17:25:29+05:30 IST