124ఎ : ఉపయోగమే దురుపయోగం

ABN , First Publish Date - 2022-05-14T05:55:10+05:30 IST

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124 ఎ (రాజద్రోహ నేరం)ను తాత్కాలికంగా పక్కనపెట్టాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తప్పనిసరిగా ఆహ్వానించవలసినవే....

124ఎ : ఉపయోగమే దురుపయోగం

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124 ఎ (రాజద్రోహ నేరం)ను తాత్కాలికంగా పక్కనపెట్టాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తప్పనిసరిగా ఆహ్వానించవలసినవే. ప్రస్తుత చీకటి వాతావరణంలో అది కచ్చితంగా వెలుగు రేఖే. ఈ ఉత్తర్వులో ఆరు అంశాలున్నాయి:

1. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి5 న్యూస్ ఛానళ్లు దాఖలు చేసిన కేసులో గత సంవత్సరం మే 31న ఇచ్చిన మధ్యంతర స్టే తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుంది.

2. ఆ చట్టనిబంధన పరిశీలనలో ఉంది గనుక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ నిబంధన కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో, దర్యాప్తు కొనసాగించడంలో, నిర్బంధ చర్యలు తీసుకోవడంలో నిగ్రహం పాటిస్తాయని ఆశిస్తున్నాం, అభిలషిస్తున్నాం.

3. ఐపిసి 124ఎ కింద కొత్త కేసులు నమోదైతే సంబంధిత న్యాయస్థానాలను తగిన ఉపశమనం కోరడానికి బాధిత వ్యక్తులకు స్వేచ్ఛ ఉంది. వారు కోరిన ఉపశమనాలను పరీక్షించేటప్పుడు, ప్రస్తుత ఉత్తర్వులను, భారత ప్రభుత్వం ప్రకటించిన స్పష్టమైన వైఖరిని దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

4. ఐపిసి సెక్షన్ 124ఎ నేరారోపణ కింద కొనసాగుతున్న విచారణలు, అభ్యర్థనలు, ప్రక్రియలు అన్నీ కూడ తాత్కాలికంగా పక్కన పెట్టాలి. ఇతర సెక్షన్ల కింద విచారణలు ఉంటే న్యాయస్థానాలు వాటిని కొనసాగించవచ్చు.

5. ఐపిసి సెక్షన్ 124ఎను దురుపయోగం చేయగూడదని, మా ముందు ప్రతిపాదించినట్టుగా, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది.

6. ఈ ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ కొనసాగుతాయి. 


ఆయా చోట్ల ‘నిగ్రహం పాటించడం’, ‘ఆశ’, ‘అభిలాష’, ‘విజ్ఞప్తి’, ‘స్వేచ్ఛ’, ‘కొనసాగించవచ్చు’ వంటి పదప్రయోగాలు కొన్ని ప్రశ్నలకు తావిస్తాయి గాని, వాటిని పక్కన పెట్టి ఇంకా లోతైన విషయాలు ఆలోచించవలసి ఉంది. భారత ప్రజలను మొత్తంగా, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాన్ని ప్రత్యేకంగా ఎక్కుపెట్టి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన ఈ రాజద్రోహ నిబంధన రాజ్యాంగబద్ధతను తేల్చమని ఫిర్యాదిదార్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. సెక్షన్ 124ఎ రాజ్యాంగబద్ధం అవునా, కాదా? అనే ప్రశ్న మీద విచారణ జరుపుతుండగానే, తమ ప్రభుత్వం మరెన్నో కాలం చెల్లిన చట్టాలను తొలగించిందని, సెక్షన్ 124ఎ పునఃపరీక్ష, పునఃపరిశీలన ఒక ‘అర్హమైన వేదిక’ ముందు జరగబోతున్నాయని, ఆ ‘తగిన వేదిక’ కసరత్తు ముగిసేవరకూ వేచిచూడమని ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలయింది. నిజానికి సుప్రీంకోర్టు తేల్చవలసినది మరొకరెవరో దాన్ని పునఃపరీక్షిస్తారా, పునఃపరిశీలిస్తారా అనికాదు, వారి కసరత్తు కోసం ఎదురుచూడడం కాదు. (అసలు ప్రభుత్వ అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు ముందు ఆ ‘అర్హమైన వేదిక’ ‘తగిన వేదిక’ అనే మాటలు వాడడం సుప్రీంకోర్టు స్థాయిని, అర్హతను, సమర్థతను, యోగ్యతను ప్రశ్నించడమే, అవమానించడమే).


ప్రభుత్వ అఫిడవిట్ సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయాన్ని వాయిదా వేయించడానికి, కాలయాపన చేయడానికి ఒక సాకుగా మాత్రమే దాఖలయిందని న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలు ఆలోచించవలసినవే. ఆ ప్రశ్న కూడ అలా ఉంచి, ఈ మధ్యంతర ఉత్తర్వులు సెక్షన్ 124ఎ ‘దురుపయోగం’ మీద దృష్టి పెట్టాయి గాని, అసలు దాని ఉపయోగం కూడ అభ్యంతరకరమైనదనే విషయం పరిగణించలేదు. ‘మాట, రాత, సైగ, వ్యక్తీకరణల ద్వారా ప్రభుత్వం పట్ల అవిశ్వాసం కలిగించడం’ శిక్షార్హమైన నేరం అవుతుందని చెప్పే ఆ సెక్షన్ కచ్చితంగా రాజ్యాంగ అధికరణం 19 హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యాలకు, భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమైనది. శరీరానికి, ప్రాణానికి, ఆస్తికి నష్టం కలిగించే చర్యను నేరంగా చూడవచ్చు, అటువంటి చర్యలకు శిక్షలను భారత శిక్షా స్మృతి సూచించింది. కాని భావప్రకటనను నేరంగా చూడడం అప్రజాస్వామికం, రాజ్యాంగవ్యతిరేకం. అందువల్ల అసలు ఆ సెక్షన్ విషయంలో ఉపయోగమే దురుపయోగం. తుదితీర్పులో ఈ చర్చకు అవకాశం ఇస్తారో లేదో తెలియదు గాని, ప్రస్తుతానికి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కారణంగా ఈ చర్చ చేయకుండా ఉండిపోయారనిపిస్తున్నది.


అలాగే, ప్రస్తుతం సెక్షన్ 124ఎ ఆరోపణను ఎదుర్కొంటూ విచారణలో ఉన్న ఖైదీల మీద ఆ విచారణను తాత్కాలికంగా పక్కనపెట్టాలనే సుప్రీంకోర్టు ఆదేశం వల్ల వారికి బెయిల్ మార్గం సుగమమైందని కొందరు న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘బెయిల్ సాధారణం, జైలు మినహాయింపు’ అని 1977లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విఆర్ కృష్ణయ్యర్ ఇచ్చిన, భారత న్యాయసూత్రంగా మారిన తీర్పు ఇకనుంచి సెక్షన్ 124ఎ నిందితులకు వర్తిస్తుందని అంటున్నారు. కాని నిజానికి, పోలీసులు సెక్షన్ 124ఎ అనే ఒక్క సెక్షన్‌తోనే కేసు పెట్టరు. ఆ సెక్షన్‌తో పాటు ఐపిసిలోని నాలుగైదు సెక్షన్లు, రాష్ట్ర ప్రజా భద్రతా చట్టంలోని నాలుగైదు సెక్షన్లు, యుఎపిఎలోని నాలుగైదు సెక్షన్లు, కావాలనుకుంటే పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం వంటి చట్టాలలోని నాలుగైదు సెక్షన్లు కలిపి ఎఫ్ఐఆర్, లేదా చార్జిషీట్ తయారు చేస్తారు. అటువంటి కేసుల్లో ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నవారికి ఇప్పుడు ఒక్క 124ఎను పక్కనపెట్టినా బెయిల్ ఉపశమనమేమీ దొరకదు. 


జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో అధికారిక గణాంకాల ప్రకారమే దేశంలో 2020 చివరి నాటికి జైళ్లలో ఉన్న మొత్తం 4,88,511 మందిలో 3,71,848 మంది విచారణలో ఉన్న ఖైదీలే. అంటే నూటికి 76 మంది నేరం రుజువై శిక్షపడిన వారు కాదు. వారిలో ఒక్కొక్కరి మీద ఎన్నో కేసులు, ఒక్కొక్క కేసులో ఎన్నో సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 124ఎ ఆరోపితులుగా ఉన్నవారు 13,000 మంది ఉంటారని న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కాని ఆ సంఖ్య ఇంకా ఎక్కువ కూడ కావచ్చు. ఈ ఉత్తర్వుల వల్ల వారి మీద సెక్షన్ 124ఎ విచారణ తాత్కాలికంగా ఆగిపోయినా, మిగిలిన సెక్షన్లు, మిగిలిన కేసులు ఉంటాయి గనుక ఉపశమనం దక్కే అవకాశం తక్కువ.


అసమ్మతివాదుల మీద, అధికారపక్షానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి మీద ప్రభుత్వం అమలు చేయదలచుకున్న దమననీతికి అవకాశం ఇచ్చే ఎన్నో నిబంధనలు భారత శిక్షా స్మృతిలో, నేర విచారణా స్మృతిలో, ప్రత్యేక చట్టాలలో ఉన్నాయి. అటువంటి ప్రజావ్యతిరేక చట్ట నిబంధనలలో సెక్షన్ 124ఎ ఒకానొకటి మాత్రమే. ప్రివెంటివ్ డిటెన్షన్ ఆక్ట్, నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్, అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్, రాష్ట్రాల పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్‌లు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్ వంటి అనేక చట్టాలలో ప్రభుత్వాలు ప్రజల మీద ప్రయోగించగల నిర్బంధకాండకు అవకాశాలున్నాయి. అవన్నీ ఉండగా సెక్షన్ 124ఎ తొలగించినా పెద్ద ఉపశమనమేమీ ఉండదు.


ఉదాహరణకు, భీమా కోరేగాం కేసులో సెక్షన్ 124ఎతో పాటు ఐపిసిలోని మరొక ఏడు సెక్షన్లు, యుఎపిఎలోని తొమ్మిది సెక్షన్ల కింద నేరారోపణలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోతున్న ఆ ప్రజాపక్ష మేధావులకు సెక్షన్ 124ఎ తాత్కాలిక ఉపసంహరణ మాత్రమే ఉపశమనం ఇవ్వలేదు. వారి విషయంలో బెయిల్‌కు అడ్డుపడుతున్నది యుఎపిఎ. అందులోనూ సెక్షన్ 43(డి)(5) అనే నిబంధన. ఆ నిబంధన అప్రజాస్వామికమైనదనీ, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమైనదనీ, దాన్ని తొలగించాలనీ అమితాభ్‌ పాండే సహా పదకొండు మంది మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు దాఖలు చేసిన కేసు నవంబర్ 18న సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు, కేంద్రప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.


సెక్షన్ 124ఎ కన్న దుర్మార్గమైన ఆ 43(డి)(5) నిబంధనను, అసలు యుఎపిఎ చట్టాన్ని, అటువంటి అనేక నిర్బంధ చట్టాలను పునఃపరిశీలించాలి, పునఃపరీక్షించాలి, రద్దు చేయాలి. భావప్రకటనను నేరంగా చూసే చట్టాలను రద్దు చేయాలి. ఎవరి శరీరానికీ, ప్రాణానికీ, ఆస్తికీ హాని కలిగించే ఎటువంటి భౌతిక చర్యకు పాల్పడకపోయినా, కేవలం భావప్రకటన చేసినందుకు ఏళ్ల తరబడి జైలుపాలు చేసే క్రూరచట్టాలన్నిటి గురించి చర్చకైనా, ఈ సెక్షన్ 124ఎ చర్చ నాంది పలకాలి.

 ఎన్. వేణుగోపాల్

Read more