పంజాబ్‌లో 122 మంది నేతలకు భద్రత ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-03-12T23:38:57+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న భగ్వంత్ మాన్ ఆ రాష్ట్ర పోలీస్ డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్ది గంటలకే..

పంజాబ్‌లో 122 మంది నేతలకు భద్రత ఉపసంహరణ

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న భగ్వంత్ మాన్ ఆ రాష్ట్ర పోలీస్ డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్ది గంటలకే 122 మంది రాజకీయవేత్తల భద్రతపై వేటు పడింది. వీరికి కల్పించిన భద్రతను ఉపసంహరించాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) రాష్ట్రంలోని ఎస్ఎస్‌పీలు, సీపీలకు ఒక లేఖలో ఆదేశాలు జారీ చేశారు. వీరిలో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.


కాంగ్రెస్ గత ప్రభుత్వంలో భద్రత కల్పించిన పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లే ఈ జాబితాలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కొందరు ఈసారి కూడా గెలిచారు. భద్రత ఉపసంహరించుకోనున్న వారి జాబితాలో కేబినెట్ మాజీ మంత్రులు, అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉన్నారు. మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రాజ్‌కుమార్ వెర్కా, భరత్ భూషణ అషు, రణ్‌దీప్ సింగ్ నభా, విధానసభ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి, విధానసభ మాజీ స్పీకర్ రాణా కేపీ సింగ్, రజియా సుల్తానా, పర్‌గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వాజా వార్రింగ్, అరుణ చౌదరి, రాణా గుర్జీత్ సింగ్, త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, సుఖ్‌బీర్ సింగ్ సర్కారియా తదితరుల పేర్లు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ భార్య పేరు కూడా ఇందులో ఉంది. ఆమెకు కల్పించిన భద్రతా సిబ్బంది నుంచి ఏడుగురిని ఉపసంహరించనున్నారు.

Updated Date - 2022-03-12T23:38:57+05:30 IST