ఐదేళ్లలో 1200 కోట్లు

ABN , First Publish Date - 2021-04-08T07:25:46+05:30 IST

వైద్య టెక్నాలజీ రంగంలో అగ్రగామి కంపెనీ మెడ్‌ట్రానిక్‌ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించింది.

ఐదేళ్లలో 1200 కోట్లు

  • మెడ్‌ట్రానిక్‌ పెట్టుబడులు.. 
  • హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ప్రారంభం
  • అమెరికా ఆవల పెద్ద కేంద్రమిదే.. కార్యకలాపాల విస్తరణ
  • ఎంఈఐసీని ప్రారంభించిన పరిశ్రమల మంత్రి కేటీఆర్‌
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల విస్తరణ
  • పాలనా సంస్కరణలోనూ టెక్నాలజీకి పెద్దపీట
  • వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వర్చువల్‌ సదస్సులో మంత్రి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వైద్య టెక్నాలజీ రంగంలో అగ్రగామి కంపెనీ మెడ్‌ట్రానిక్‌ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడ బీఎ్‌సఆర్‌ టెక్‌పార్క్‌లోని ‘మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)’ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. అమెరికా వెలుపల మెడ్‌ట్రానిక్‌కు ఇదే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఈఐసీలో వచ్చే ఐదేళ్లలో మెడ్‌ట్రానిక్‌ రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నిపుణుల సంఖ్యను దాదాపు 1,000 మందికి పెంచుకోనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో 400 మందికి పైగా ఇంజనీర్లు పని చేస్తున్నారు. 


మెడ్‌ట్రానిక్‌ చేతిలో 150కి పైగా పేటెంట్లు ఉన్నాయి. వీటిని మరింత పెంచడానికి హైదరాబాద్‌ కేంద్రం దోహదపడుతుందని ఇండియా మెడ్‌ట్రానిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ మదన్‌ కృష్ణన్‌ తెలిపారు. అత్యాధునిక మెడికల్‌ టెక్నాలజీల అభివృద్ధి, టెస్టింగ్‌కు ఎంఈఐసీ గ్లోబల్‌ హబ్‌గా మారుతుందని చెప్పారు. మెడ్‌ట్రానిక్‌ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నొవార్టిస్‌ తదితర కంపెనీలు హైదరాబాద్‌లో అతిపెద్ద టెక్నాలజీ, డెవల్‌పమెంట్‌ కేంద్రాలను కలిగి ఉన్నాయని, ఆ జాబితాలో మెడ్‌ట్రానిక్‌ కూడా చేరిందని చెప్పారు. హైదరాబాద్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు గత ఏడాది అగస్టులో మెడ్‌ట్రానిక్‌ ప్రకటించిందని, చాలా స్వల్ప కాలంలోనే కొత్త కేంద్రాన్ని ప్రారంభించిందని అన్నారు. భారత్‌లో వైద్య పరికరాల తయారీకి కూడా హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోందని కేటీఆర్‌  చెప్పారు. అధిక విలువ కలిగిన వైద్య పరికరాల డిజైన్‌, అభివృద్ధిని ప్రోత్సహించాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 

Updated Date - 2021-04-08T07:25:46+05:30 IST