జగన్ సీఎంగా ఉన్నంతకాలం.. రూ.12వేలు వస్తాయి..!

ABN , First Publish Date - 2021-11-09T17:14:24+05:30 IST

సీఎం జగన్‌కు సంబంధించిన..

జగన్ సీఎంగా ఉన్నంతకాలం.. రూ.12వేలు వస్తాయి..!

సీఎం ‘సంస్థ’ పేరుతో టోపీ

రూ.10 వేలు చెల్లిస్తే ప్రతినెలా రూ.12 వేలు ఇస్తారని ఆశ 

సీఎంగా జగన్‌ ఉన్నంతకాలం వస్తాయని వల

విద్యార్థుల నుంచి రూ.40 లక్షల వరకూ వసూలు 

నెల్లూరుకు చెందిన సుమన్‌క్రాంత్‌ రెడ్డి టోకరా

గుంటూరు అర్బన్‌ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు 


గుంటూరు: సీఎం జగన్‌కు సంబంధించిన ఓ పబ్లికేషన్స్‌ సంస్థ షేర్లు కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయని నమ్మించాడు. విద్యార్థుల నుంచి దాదాపు రూ.40 లక్షలు వసూలు చేసి నట్టేట ముంచేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీని ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు వివరాలివీ.. వివిధ ప్రాంతాల విద్యార్థులు గుంటూరులో కాకాని రోడ్డులో మంగళదాస్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. సమీపంలోని కాలేజీలో బీఎస్సీ, ఎంఎల్‌టీ చదువుకుంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన దొంతిరెడ్డి సుమన్‌క్రాంత్‌ రెడ్డి అనే యువకుడు అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. తాను ఏడేళ్లు వైసీపీ నాయకుడి వద్ద పని చేశానని, పార్టీలో తిరుగుతుంటానని విద్యార్థులను పరిచయం చేసుకున్నాడు.


సీఎంకు సంబంధించిన ఓ సంస్థ షేర్ల విషయాన్ని ప్రస్తావించాడు. ఒకసారి రూ.10 వేలు చెల్లిస్తే జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం ప్రతినెలా రూ.12 వేలు వస్తాయని ఆశ పెట్టాడు. ఒక్కొక్కరికి పెట్టుబడి పరిమితి రూ.80 వేల వరకు మాత్రమేనని చెప్పాడు. ఈ విధంగా మొదటి నెలలో రూ.10 వేలు కట్టిన వారికి నమ్మకం కలిగించేందుకు రూ.12 వేలు చొప్పున జమ చేశాడు. నిజమేనని నమ్మిన విద్యార్థులు తమ దగ్గరున్న డబ్బుతో పాటు బంధువులు, తెలిసిన వారి వద్ద డబ్బు తీసుకుని పెద్ద మొత్తంలో కట్టారు. సుమన్‌క్రాంత్‌ రెడ్డితో పాటు ఆయన చెల్లెలు జొన్నకూటి బెస్లీజాస్మిని, ఆమె భర్త రామ్‌ప్రసాద్‌ అకౌంట్‌కు కూడా డబ్బు పంపించారు. సమరసింహారెడ్డి (దోర్నాల) రూ.17 లక్షలు, గణేశ్‌ (అచ్చంపేట పరిధిలోని కోనూరు) రూ.3 లక్షలు, సుధీర్‌ (మాచర్ల) రూ.లక్ష, ఆనంద్‌ (ఒంగోలు) రూ.30 వేలు.. ఇలా అనేక మంది విద్యార్థులు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సుమన్‌క్రాంత్‌ రెడ్డి వారికి ఒకటి రెండు నెలలు డబ్బు తిరిగి చెల్లించాడు. దీంతో విద్యార్థులు ఒక్కొక్కరి పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు కట్టించారు. వారు ఉంటున్న హాస్టల్‌ నిర్వాహకురాలు కొమ్మూరి వెంకటరమణ కూడా రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టారు.


అయితే ఆమె అనారోగ్యంతో రెండు నెలలక్రితం కన్నుమూశారు. గత జూన్‌ నుంచి సుమన్‌క్రాంత్‌ రెడ్డి కనిపించకుండా పోయాడు. సుమారు 30 మంది నుంచి రూ. 35 నుంచి రూ. 40 లక్షల మధ్య వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. సీఎం జగన్‌కు సంబంధించిన సంస్థ అని చెప్పటంతో నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. సుమన్‌క్రాంత్‌ రెడ్డి తల్లి సౌదీలో ఉంటుందని, ఆయన వసూలు చేసిన సొమ్మును ఆమె ఖాతాకు మళ్లించాడని చెప్పారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు పాతగుంటూరు సీఐ వాసును ఆదేశించారు. కాగా సోమవారం సాయంత్రం పాతగుంటూరు పోలీసులను ఆశ్రయించగా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేశారని బాధిత విద్యార్థులు లబోదిబోమంటున్నారు. సీఎంకు సంబంధించిన సంస్థ పేరుతో మోసం చేయడం వల్లే పోలీసులు కనీసం విచారించేందుకు కూడా ప్రయత్నించటంలేదని వాపోతున్నారు.

Updated Date - 2021-11-09T17:14:24+05:30 IST