విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌

ABN , First Publish Date - 2020-08-05T00:29:12+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌ మంజూరైంది

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మందికి బెయిల్‌ మంజూరైంది. మంగళవారం సాయంత్రం 12 మందికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కొరియాకు చెందిన సీఈవో, డైరెక్టర్‌ సహా 12 మందికి బెయిల్‌ వచ్చింది. కాగా.. స్టెరైన్‌ గ్యాస్‌ నిల్వలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 12 మంది అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. 


కేసు పూర్వపరాలివీ..

కాగా.. నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.


ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇంకా కొందరు విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మనుషులే కాదు.. జంతువులు, సరిసృపాలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీపై గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-08-05T00:29:12+05:30 IST