బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో12 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-07T10:03:28+05:30 IST

ఒకరు కాదు ఇద్దరు కాదు గంటల వ్యవధిలో 12 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. శ్వాస ఇబ్బందితో ఒకరివెంట ఒకరు ఊపిరి

బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో12 మంది మృతి

బుధవారం అర్థరాత్రి నుంచి వరుసగా మరణాలు

రాష్ట్రంలో కొత్త గా 6,026  కేసులు.. 52 మరణాలు


హైదరాబాద్‌/బెల్లంపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): ఒకరు కాదు ఇద్దరు కాదు గంటల వ్యవధిలో 12 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. శ్వాస ఇబ్బందితో ఒకరివెంట ఒకరు ఊపిరి విడిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం మధ్య వరుసగా రోగులు మృతిచెందారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వంద పడకలతో ఈ ఐసోలేషన్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. 67 మంది చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల నుంచి కేంద్రానికి తీసుకొచ్చినవారిలో 12 మంది పరిస్థితి విషమంగా మారి చనిపోయారు.  సరైన చికిత్స అందలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తుండగా, వైద్యులు దానిని ఖండిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది.. బతికే అవకాశం లేదని చెప్పిన తర్వాత ఐసొలేషన్‌ కేంద్రానికి తీసుకొచ్చారని వివరించారు.


ఐసోలేషన్‌ కేంద్రాన్ని గురువారం డీసీహెచ్‌ఎస్‌ అరవింద్‌ పరిశీలించారు. రోగుల మరణానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుల్లో బెల్లంపల్లి బాబుక్యాంపు బస్తీ యువతి(35), మంచిర్యాల ఏసీసీ ప్రాంత వ్యక్తి (42), చెన్నూరుకు చెందిన ఇద్దరు వృద్ధులు (75), (64), ఓ యువకుడు (45) ఉన్నారు. మిగతావారు.. మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వృద్ధురాలు(64), కాసిపేట మండలం దేవాపూర్‌ వాసి (59), కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరికి చెందిన మహిళ (60), కాగజ్‌నగర్‌ మండలం ఈజ్‌గాం గ్రామ వృద్ధుడు (70), వాంకిడి గ్రామ వృద్ధురాలు(75), నిర్మల్‌ జిల్లా కడెంకు చెందిన వృద్ధుడు (60). కాగా, గురువారం రాత్రి బెల్లంపల్లికి చెందిన మహిళ (43) చనిపోయింది.


రాష్ట్రంలో పదో రోజూ 50 పైగా మరణాలు

రాష్ట్రంలో బుధవారం 6,026 మందికి కరోనా నిర్ధారణ అయింది. 52 మంది చనిపోయారు. దీంతో వరుసగా పదో రోజు 50పైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4,75,748కు, మరణాలు 2,579కి పెరిగాయి. 6,551 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీల సంఖ్య 3,96,042కు చేరింది. 77,127 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 1,115 రాగా, మేడ్చల్‌లో 418, రంగారెడ్డి జిల్లాలో 403, నల్లగొండలో 368, వరంగల్‌ అర్బన్‌లో 224, సంగారెడ్డిలో 235, సిద్దిపేటలో 231 నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది బాజోజీ భాస్కర్‌(60) కరోనాతో మృతి చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంతాపం తెలిపారు.


గద్వాలలో  18 మంది రోగుల పరారీ

గద్వాల జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ వార్డు నుంచి 18 మంది గురువారం పరారయ్యారు. ఈ వార్డులో రెండ్రోజులుగా పలువురి మృతితో ఆందోళన నెలకొంది. వైద్యులు కేస్‌ షీట్‌ లేకుండా తెల్ల కాగితంపై ఉన్న పేర్ల ద్వారా చికిత్స నిర్వహిస్తున్నారని రోగులు ఆరోపించారు. కాగా, పరారైన వారికోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-05-07T10:03:28+05:30 IST