నీట్ పీజీ సీటు ఇప్పిస్తానని మోసం.. నిందితుడిని డాక్టర్‌గా భావించిన బాధితులు.. నిజానికి అతనెవరంటే?..

ABN , First Publish Date - 2022-01-07T07:45:18+05:30 IST

ఢిల్లీలో 12 యువతులను ఎయిమ్స్ వైద్య కళాశాలలో నీట్ పీజీ సిటు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి మోసం చేశాడు. బాధితులు ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు కాజేశాడు. నిందితుడు తనను ఒక ఎయిమ్స్ డాక్టర్‌గా అందరికీ పరిచయం...

నీట్ పీజీ సీటు ఇప్పిస్తానని మోసం.. నిందితుడిని డాక్టర్‌గా భావించిన బాధితులు.. నిజానికి అతనెవరంటే?..

ఢిల్లీలో 12 యువతులను ఎయిమ్స్ వైద్య కళాశాలలో నీట్ పీజీ సిటు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి మోసం చేశాడు. బాధితులు ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు కాజేశాడు. నిందితుడు తనను ఒక ఎయిమ్స్ డాక్టర్‌గా అందరికీ పరిచయం చేసుకున్నాడని తెలిసింది. కానీ అతని నిజస్వరూపం తెలిసి పోలీసుల సైతం ఆశ్చర్యపోయారు. బాధితులలో ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


వివరాల్లోకి వెళితే..  దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 21న ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ప్రకారం ఆ యువతికి ఫేస్‌బుక్ ద్వారా డాక్టర్ అంశు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అంశు ఢిల్లీలోని ప్రముఖ వైద్యకళాశాల ఎయిమ్స్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నట్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఎయిమ్స్‌లో నీట్ పీజీ సీటు ఇప్పిస్తానని డాక్టర్ అంశు ఆ యువతితో చెప్పాడు. అందుకోసం రూ.6 లక్షలు ఆమె వద్ద తీసుకున్నాడు. ఆ తరువాత బాధితురాలు డాక్టర్ అంశుకి ఫోన్ చేయగా.. నెంబర్ స్విచాఫ్ అని వచ్చింది. 


తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  బాధితురాలు రూ.6 లక్షలు ఒక బ్యాంక్ అకౌంట్‌లో వేసింది. ఆ బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా పోలీసులు నిందితుడి ఇంటి అడ్రస్ తెలసుకున్నారు. నిజానికి ఆ బ్యాంక్ అకౌంట్ ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన షాజుమ్మన్ అనే వ్యక్తికి సంబంధించినది. షాజుమ్మన్‌ని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. 


నిందితుడు షాజుమ్మన్‌ని పోలీసులు తమ పద్ధతిలో విచరణ చేయగా.. అతను చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్య పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. షాజుమ్మన్ 12వ తరగతి కూడా చదువుకోలేదు. అతను 2010లో ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఒక కాల్ సెంటర్ ఉద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత ఉద్యోగం వదిలేసి రకరకాల మోసాలు చేసి డబ్బులు సంపాదించాడు. గత కొద్ది కాలంగా డాక్టర్ కావాలనుకునే యువతులను ట్రాప్ చేయడానికి ఫేస్‌బుక్‌లో ఒక నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ప్రొఫైల్ ప్రకారం షాజుమ్మన్ తన పేరుని అంశుగా మార్చుకున్నాడు. తాను ఒక డాక్టర్‌నని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య కళాశాలలో పనిచేస్తున్నానని యువతులను నమ్మించాడు. వారికి ఎయిమ్స్‌లో డాక్టర్ సీటు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6 లక్షలు కాజేశాడు. అలా ఇప్పటివరకు 12 మంది యువతులను మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.


పోలీసులు షాజుమ్మన్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అతడిని కోర్టులో హాజరుపరిచారు.


Updated Date - 2022-01-07T07:45:18+05:30 IST