పాక్ నుంచి భారత్‌కు చేరుకోనున్న 114 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-07-06T21:37:50+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా పాకిస్థాన్‌లో చిక్కుకున్న 114 మంది భారతీయులు జులై 9న

పాక్ నుంచి భారత్‌కు చేరుకోనున్న 114 మంది భారతీయులు

ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాకిస్థాన్‌లో చిక్కుకున్న 114 మంది భారతీయులు జులై 9న స్వదేశానికి చేరుకోనున్నారు. భారతీయులను అట్టారి-వాగా బోర్డర్ ద్వారా భారత్‌కు పంపనున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అట్టారి-వాగా బోర్డర్ ద్వారా పాకిస్థాన్‌లో చిక్కుకున్న 700 మందికి పైగా భారతీయులు తమ మాతృభూమికి చేరుకున్నారు. హై సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను పాటిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం బ్యాచ్‌ల కింద వీరిని భారత్‌కు పంపింది. భారతీయులంతా పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లి అక్కడే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కరోనా నేపథ్యంలో భారతీయులకు ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారణ అయిన తరువాతే పాకిస్థాన్ ప్రభుత్వం వారిని భారత్‌కు పంపుతుంది. కాగా.. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 2,31,818 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 4,762 మంది మృత్యువాతపడ్డారు. పాకిస్థాన్‌లో అత్యధిక కరోనా కేసులు సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్‌లలోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-07-06T21:37:50+05:30 IST