Hyderabad : ఏడాదిన్నరలో 5,456 ప్రమాదాలు.. 1136 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-09-13T16:45:21+05:30 IST

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి సైబరాబాద్‌ పోలీసులు..

Hyderabad : ఏడాదిన్నరలో 5,456 ప్రమాదాలు.. 1136 మంది దుర్మరణం

హైదరాబాద్‌ సిటీ : రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి సైబరాబాద్‌ పోలీసులు రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఆర్టీఏఎమ్‌ సెల్‌) ఏర్పాటు చేశారు. డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న ఆర్టీఏఎమ్‌ సెల్‌ విభాగం ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను అధ్యయనం చేసింది. అక్కడ ప్రమాదం జరగడానికి గల కారణాలు, అక్కడ రోడ్డు నిర్వహణ ఎలా ఉంది..? ఇంజనీరింగ్‌ లోపాలు ఏంటి..? ఆ రోడ్డు నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు..? ఇప్పటి వరకు ఆ స్పాట్‌లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి..? అనేది వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఒక ఏడాదిలో ఒకే ప్రాంతంలో 500  మీటర్ల పరిధిలో 5 ప్రమాదాలు జరిగితే ఆ ప్రాంతాన్ని యాక్సిడెంట్‌ స్పాట్‌గా లెక్కిస్తున్నారు. ఇలా సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 115 యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది.


ఏడాదిన్నరలో 5,456 ప్రమాదాలు

యాక్సిడెంట్స్‌పై ప్రత్యేకంగా మానిటరింగ్‌ చేస్తున్న విభాగం ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే ఏడాదిన్నరలో 5,456 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించింది. ఈ ప్రమాదాల కారణంగా 1136 మంది దుర్మరణం చెందారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కాగా, 5298 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది కోలుకోగా వందల మంది ఏదో ఒక రకం అంగవైకల్యంతో బతుకు వెళ్లదీస్తున్నారు.

Updated Date - 2021-09-13T16:45:21+05:30 IST