విమానాశ్రయం కోసం... 11 వేల వృక్షాల నరికివేతకు ‘గ్రీన్’ సిగ్నల్

ABN , First Publish Date - 2021-09-13T22:28:39+05:30 IST

ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 వేలు... ఖచ్చితంగా మాట్లాడుకుంటే, 11,510 వృక్షాలు నేలకూలబోతున్నాయి. వాటి స్థానంలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొననుంది. ఇది పర్యావరణ ప్రేమికులకి కాస్త బాధ కలిగించేదే అయినా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుపోవాలంటే తప్పదు మరి.

విమానాశ్రయం కోసం... 11 వేల వృక్షాల నరికివేతకు ‘గ్రీన్’ సిగ్నల్

ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 వేలు... ఖచ్చితంగా మాట్లాడుకుంటే, 11,510 వృక్షాలు నేలకూలబోతున్నాయి. వాటి స్థానంలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొననుంది. ఇది పర్యావరణ ప్రేమికులకి కాస్త బాధ కలిగించేదే అయినా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుపోవాలంటే తప్పదు మరి. అందుకే, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గౌతమ బుద్ధా నగర్ జిల్లాలో వేలాది చెట్లను నరికి వేసేందుకు ‘గ్రీన్’ సిగ్నల్ ఇచ్చేసింది. 

జేవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేజ్ 1 పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. 2024 కల్లా కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఉత్తప్రదేశ్‌లోని ఈ తాజా ఎయిర్‌పోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో నిర్మించనున్నారు. కాగా విమానాశ్రయం కోసం నేలకూల్చే 11 వేల పైచిలుకు చెట్లలో 196 మాత్రం ప్రత్యేకంగా హైడ్రాలిక్ యంత్రాల సాయంతో మరో చోటికి తరలిస్తారు. మర్రి మొదలైన ఈ మహావృక్షాలు మళ్లీ భూమిలో పాతబడతాయి. మిగిలిన చెట్లు, అందులో 8 వేల వరకూ యూకలిప్టస్ వృక్షాలు పూర్తిగా నరికి వేయటం జరుగుతుంది. అంతే కాదు, మరో 2 వేల సాధారణ చెట్లు కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరిగేలోగా నేలకూల్చాల్సి వస్తుందట. అయితే, అవేవీ పర్యావరణ పరంగా మరీ ప్రధానమైనవి కావని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

11 వేల వృక్షాల్ని ఒకేసారి నరకటం కూడా జరగదని అధికారులు చెబుతున్నారు. నిర్మాణం కొనసాగుతుండగా అవసరాన్నిబట్టీ దశల వారీగా నరికివేత పనులు జరుగుతాయట. అలాగే, ప్రతీ వృక్షానికి బదులు 10 మొక్కల్ని నాటేలాగా విమానాశ్రయాన్ని నిర్మిస్తోన్న ప్రైవేట్ సంస్థ చర్యలు తీసుకుంటోంది.      

Updated Date - 2021-09-13T22:28:39+05:30 IST