Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.1100 కోట్లు

  • పాలనాపరమైన అనుమతులు మంజూరు .. 
  • ఆస్పత్రి డిజైన్లను ఖరారు చేసిన సర్కారు 


హైదరాబాద్‌/హన్మకొండ అర్బన్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ను ఆరోగ్య నగరంగా మార్చుతామన్న కేసీఆర్‌ సర్కారు.. ఆ దిశగా అడుగు ముందుకేసింది. అక్కడ నిర్మించతలపెట్టిన మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.1100 కోట్ల పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆస్పత్రికి సంబంధించిన భవన నిర్మాణ డిజైన్ల నమూనాలను కూడా ఖరారు చేసింది. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్థుల ఎత్తులో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. 2 వేల పడకలతో నిర్మితమయ్యే ఈ ఆస్పత్రిలో 800 పడకలు సూపర్‌ స్పెషాలిటీ సేవల కోసం కేటాయించనున్నారు. ఆస్పత్రి పైభాగాన హెలీప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. అత్యవసరంగా వైద్యులను హైదరాబాద్‌ నుంచి రప్పించేందుకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను అత్యవసరంగా తరలించేందుకు ఈ హెలిప్యాడ్‌లను వినియోగిస్తారు. కాగా, జిల్లాలో ఇప్పటికే ఉన్న కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి ఈ ఆస్పత్రి అనుబంధంగా ఉండనుంది. రాష్ట్రంలోని నిమ్స్‌, ఎంఎన్‌జే ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి హోదా ఉండగా.. అదే తరహాలో ఈ ఆస్పత్రికి కూడా ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి హోదా కల్పించనుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందించడానికి మొత్తం 215.35 ఎకరాల్లో హెల్త్‌ సిటీని నిర్మించాలని రాష్ట్ర సర్కారు తలపెట్టింది. స్పెషాలిటీ వైద్యం కోసం 1200 పడకలను కేటాయిస్తున్నారు. ఇందులో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్‌ మొదలైన విభాగాలు ఉంటాయి. ఇక సూపర్‌ స్పెషాలిటీల కోసం 800 పడకలు కేటాయిస్తున్నారు. అందులో ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్ర్టో ఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలు ఉంటాయి. అవయవ మార్పిడి సహా క్యాన్సర్‌ చికిత్సకు ఇక్కడ ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. 


మంత్రి ఎర్రబెల్లి హర్షం 

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులు మంజూరు కావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.  కాగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు  రూ.250 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement