Rupee Co-operative Bank Ltd: 110 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు మూత

ABN , First Publish Date - 2022-09-22T21:57:15+05:30 IST

పూణెలో వందేళ్లకు పైగా సేవలు అందిస్తున్న సహకార బ్యాంకు సేవలు నేటితో నిలిచిపోయాయి. దీంతో ఆ బ్యాంకు డిపాజిటర్లు,

Rupee Co-operative Bank Ltd: 110 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు మూత

న్యూఢిల్లీ: పూణెలో వందేళ్లకు పైగా సేవలు అందిస్తున్న సహకార బ్యాంకు సేవలు నేటితో నిలిచిపోయాయి. దీంతో ఆ బ్యాంకు డిపాజిటర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సంగతేంటన్న ఆందోళన మొదలైంది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించిందంటూ రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(Rupee Co-operative Bank Ltd) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఇదివరకే ప్రకటించింది. సెప్టెంబరు 22 నుంచి బ్యాంకు మూతపడుతుందని, సేవలు నిలిచిపోతాయని ఆర్బీఐ అప్పట్లో పేర్కొంది. చెప్పినట్టుగానే 110 ఏళ్ల చరిత్ర కలిగిన రుపీ సహకార బ్యాంకు గురువారం మూతపడింది. లైసెన్స్ రద్దు కావడంతో డిపాజిట్ల సేకరణ, డిపాజిట్ల చెల్లింపు వంటివి నిలిచిపోయాయి.  


లైసెన్స్ ఎందుకు రద్దయింది?

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ (Banking Regulation Act, 1949) నిబంధనలు పాటించకపోవడం, తగినంత మూలధన లేకపోవడం, సంపాదన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలు రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ (Rupee Co-operative Bank Ltd) లైసెన్స్ రద్దుకు కారణమయ్యాయి. బ్యాకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 56లోని సెక్షన్ 11(1), సెక్షన్ 22 (3) (d) లను బ్యాంకు ఉల్లంఘించింది. అలాగే, సెక్షన్లు 22(3) (a), 22 (3) (b), 22(3)(c), 22(3) (d) and 22(3)(e)లను అది పాటించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొంది. ప్రస్తుత డిపాజిటర్ల సొమ్మును పూర్తిస్థాయిలో చెల్లించే ఆర్థిక స్థోమత బ్యాంకుకు లేదని  పేర్కొన్న ఆర్బీఐ.. బ్యాంకును కొనసాగించడం వల్ల దాని డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిపింది. 


మరి డిపాజిటర్ల సంగతేంటి?

 కో-ఆపరేటివ్ బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం..  99 శాతం కంటే ఎక్కువమంది డిపాజిటర్లు  ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులవుతారు. 18 మే 2022 నాటికి  మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో డీఐసీజీసీ రూ.700.44 కోట్లను వెనక్కి చెల్లించింది. అలాగే, లిక్విడేషన్‌పై ప్రతి డిపాజిటర్ డీఐసీజీసీ నుంచి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించేందుకు అర్హులవుతారు.

Updated Date - 2022-09-22T21:57:15+05:30 IST