6 నెలల్లో రూ.110 లక్షల కోట్లు ఉఫ్‌

ABN , First Publish Date - 2022-07-03T09:10:12+05:30 IST

కరోనా కష్టకాలంలోనూ భారీగా సంపద పోగేసుకున్న ప్రపంచ కుబేరులకు ఈ ఏడాది మాత్రం అంతగా కలిసి రాలేదు.

6 నెలల్లో రూ.110 లక్షల కోట్లు ఉఫ్‌

భారీగా కరిగిన ప్రపంచ కుబేరుల సంపద జూ మస్క్‌ ఆస్తిలో రూ.4.90 లక్షల కోట్లు ఫట్‌ 

రూ.4.98 లక్షల కోట్లు తరిగిన బెజోస్‌ నెట్‌వర్త్‌ జూ సగానికి పైగా తగ్గిన మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సిరి 


రోనా కష్టకాలంలోనూ భారీగా సంపద పోగేసుకున్న ప్రపంచ కుబేరులకు ఈ ఏడాది మాత్రం అంతగా కలిసి రాలేదు. ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం ఆస్తి ఈ ఏడాది (2022) ప్రథమార్ధంలో 1.4 లక్షల కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో ఈ విలువ రూ.110.6 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆరు నెలల్లో ప్రపంచ కుబేరుల సంపద నష్టంలో ఇదే అత్యధిక మొత్తం. వరల్డ్‌ నం.1 ధనికుడు, అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ నెట్‌వర్త్‌ 6,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.90 లక్షల కోట్లు) మేర కరిగిపోయింది. నం.2 కుబేరుడు, అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఆస్తి 6,300 కోట్ల డాలర్లు (రూ.4.98 లక్షల కోట్లు) తగ్గింది. ఫేస్‌బుక్‌ వ్యవస్థాకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సంపద సగానికి పైగా క్షీణించింది. అంతేకాదు, ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 10 మంది 10,000 కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగి ఉండగా.. జూన్‌ 30 నాటికి నలుగురు మాత్రమే ఈ స్థాయి సంపద కలిగి ఉన్నారు. 



వడ్డీ రేట్ల పెంపు, వార్‌ ఎఫెక్ట్‌                  

కరోనా సంక్షోభ ప్రభావం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు ద్రవ్య ఉద్దీపనల ద్వారా అసాధారణ స్థాయిలో నగదును మార్కెట్లోకి విడుదల చేశాయి. ద్రవ్య లభ్యత అనూహ్యంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో బడా కార్పొరేట్‌ కంపెనీల ప్రమోటర్ల ఆస్తి కూడా ఆకాశమే హద్దుగా ఎగబాకింది. కానీ, అధిక ద్రవ్య లభ్యతతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రికత్తల కారణంగా ప్రపంచ దేశాల్లో ధరాఘాతం రికార్డు స్థాయిలో పెరిగింది. అదుపు తప్పిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడంతో ఈక్విటీల్లో అమ్మకాల ఒత్తిడి కారణమైంది. దాంతో కుబేరుల సంపద కూడా తగ్గుతూ వచ్చింది. 


అదానీ, అంబానీ సంపద మాత్రం అప్‌ 

ప్రపంచ టాప్‌ టెన్‌లోని భారత కుబేరులైన అదానీ, అంబానీ మాత్రం ఈ ఏడాదిలోనూ సంపద వృద్ధిని నమోదు చేసుకోగలిగారు. అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ కుటుంబం ఆస్తి 2022 ప్రథమార్ధంలో 2,200 కోట్ల డాలర్ల మేర పెరిగి 9,850 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో అత్యధిక సంపద వృద్ధి నమోదు చేసుకునే ప్రపంచ కుబేరుడు అదానీయే. గడిచిన ఆరు నెలల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆస్తి 305 కోట్ల డాలర్లు పెరిగి 9,300 కోట్ల డాలర్లుగా నమోదైంది. జూన్‌ 30 నాటికి ఆయన ప్రపంచ సంపన్నుల్లో 9వ స్థానంలో నిలిచారు. అదానీ, అంబానీ పోగేసుకోగలిగినా, దేశంలోని ఇతర సంపన్నులైన టాటా, బిర్లా, ప్రేమ్‌జీ, మహీంద్రా ఆస్తి మాత్రం భారీగా తగ్గింది. 

Updated Date - 2022-07-03T09:10:12+05:30 IST