ఒకేరోజు 11 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-11T07:03:54+05:30 IST

కరోనాతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం 11 మంది మృతి చెందారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ముగ్గురు చొప్పున, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు మృతి పడ్డారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన వ్యక్తి(40) కరోనాతో మృతి చెందాడు. అదేవిధంగా మునుగోడు మండలం చల్మెడలో మహిళ(44) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఒకేరోజు 11 మంది మృతి

కరోనాతో ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న మరణాలు

కుటుంబాలు చిన్నాభిన్నం 


నల్లగొండ, మే 10: కరోనాతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం 11 మంది మృతి చెందారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ముగ్గురు చొప్పున, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు మృతి పడ్డారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన వ్యక్తి(40) కరోనాతో మృతి చెందాడు. అదేవిధంగా మునుగోడు మండలం చల్మెడలో మహిళ(44) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. శాలిగౌరారం మండలం అడ్లూరులో వృద్దుడు(70) మృతి చెందాడు. అదేవిధంగా సూర్యాపేట మండలం తిరమలగిరి మునిసిపాలిటీకి చెందిన వ్యక్తి (46) గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలో వృద్ధురాలు(93) మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకడంతో డీసీసీబీ డైరెక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా నేరేడుచర్లకు చెందిన ప్రముఖ వ్యాపారి(60) కరోనాతో మృతి చెందారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన వృద్ధుడు(65) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో ఇద్దరు మహిళలు, మండలంలో మరో ఇద్దరు చనిపోయారు. అందులో చినకొండూరులో యువకుడు(39), ఎస్‌.లింగోటంలో వృద్ధుడు(60) ఉన్నారు. 


ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స

నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా పాజిటివ్‌తో మృతిచెందగా; మరో ఐదుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. నేరేడుచర్లకు చెందిన ప్రముఖ వ్యాపారి(60)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, అమెరికా, హైదరాబాద్‌లో మరో ఇద్దరు ఉంటున్నారు. 15రోజుల క్రితం పెద్ద కుమారుడికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ రాగా భార్యా ఇద్దరు పిల్లలతో నేరేడుచర్లలోని స్వగ్రామానికి చేరుకున్నారు. దీంతో వీరి నలుగురికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మృతుడి భార్య, తండ్రి(85), తల్లి(78)లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఎనిమిది మం ది 10రోజుల క్రితం హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఈ నెల 5వ తేదీన తల్లి మృతి చెందగా, 6వ తేదీ తండ్రి, సోమవారం వ్యాపారి మృతి చెందారు. కుటుంబ సభ్యులలో మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ కాగా, ముగ్గురు మృతిచెందటంతో మిగిలిన ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోవడంతో నేరేడుచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.


10 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

చౌటుప్పల్‌ టౌన్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 10 రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్‌తో భార్యాభర్తల మృతితో నలుగురు పిల్లలు ఒంటరి వారయ్యారు. పట్టణంలో పురుగుల మందుల దుకాణం నిర్వహించే యజమాని(58)కు భార్య, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గత నెల 25వ తేదీన యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల అనంతరం ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించా రు. ఆ వెంటనే భార్య(54) పరీక్ష చేయించుకోగా ఆమెకు సైతం పాజిటివ్‌ రావడంతో ఇద్దరూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 1వ తేదీ న యజమాని పరిస్థితి విషమించి మృతి చెందగా; సోమవారం భార్య కన్నుమూసింది. కుమార్తె వివాహం చేద్దామని కొద్ది రోజులుగా తల్లిదండ్రులు సన్నాహాలు చేస్తుండగానే ఈ ఘటన జరిగింది. 

Updated Date - 2021-05-11T07:03:54+05:30 IST