- వలస కార్మికులను బలిగొన్న అగ్ని ప్రమాదం
- భీతిల్లిన బోయిగూడ నగరంలో..
- మరో ఐదు అగ్నిప్రమాదాలు
- నివాసాల మధ్య ప్లాస్టిక్ గోదాంలు
- బోయిగూడ ఘటనతో భయాందోళన
ఎక్కడో బిహార్ నుంచి పొట్టచేతబట్టుకుని సిటీకొచ్చిన వలస కార్మికులు వాళ్లు. స్ర్కాప్ గోదాంలో ఉపాధి పొందుతున్నారు. అదే గోదాంలో ఊపిరి పోతుందని ఊహించలేకపోయారు. తెల్లారేసరికి ఆ కార్మికుల బతుకులు బుగ్గి అయ్యాయి. సికింద్రాబాద్ బోయిగూడలోని స్ర్కాప్ గోదాంలో జరిగిన ఈ ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారు జామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు ఆహుతయ్యారు. బుధవారం రోజే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మరో ఐదు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ సిటీ/ బేగంపేట : జనావాసాల మధ్య ఉండే గోదాంలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్న అధికారులు తర్వాత అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయిగూడలో బుధవారం స్ర్కాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడంతో ఇలాంటి గోదాంలున్న పలు ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ప్రమాదం తమ ప్రాంతంలో జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ఎక్స్టెన్షన్, హఫీజ్‌పేట, మాదాపూర్, బోరబండ, కొండాపూర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, బేగంబజార్, అఫ్జల్గంజ్తో పాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్, స్ర్కాప్ గోదాంలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రేటర్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ గోదాంల్లో విద్యుత్ అక్రమ కనెక్షన్లను వాడుతున్నారు. భవనాలు, గోదాంలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసే సమయంలో ఎలాంటి తీగలు వాడుతున్నారు, వాటి నాణ్యత, పని తీరు పరిశీలించాల్సిన విద్యుత్ శాఖ అవేవీ పట్టించుకోడం లేదు. అగ్నిప్రమాదాల్లో 60 శాతం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నాయని తెలిసినా వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే.
ఇవి కూడా చదవండి
కదిలిన అధికారులు
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్, జీహెచ్సీఎంసీ ఉన్నతాధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై గోదాంలు, వాణిజ్య సముదాయాల్లో సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే శంషాబాద్ జోన్ డీసీపీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం అయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్ శర్మ గాంధీ మార్చురీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
అంబర్‌పేట డంపింగ్ యార్డులో..
అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తా సమీపంలోని డంపింగ్ యార్డులో బుధవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. చెత్త నుంచి మంటలు రావడంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించాయి. జీహెచ్ఎంసీ డిజాస్టర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
చిరు వ్యాపారుల గుడిసెలు దగ్ధం
బాగ్ అంబర్‌పేట వైభవ్‌నగర్ కాలనీలో రోడ్డుపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల గుడిసెలు బుధవారం దగ్ధమయ్యాయి. దాదాపు లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. వైభవ్‌నగర్ కాలనీలో సాయమ్మ, ఉమ, వెంకటేష్ తోపాటు మరో ఇద్దరు గుడిసెలు వేసుకుని గల్లా గురిగీ (మట్టితో చేసే డిబ్జీ)లు తయారు చేసి, విక్రయిస్తారు. దాదాపు 20 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నారు. బుధవారం ఉదయం 10 సమయంలో సాయమ్మ వంట చేయడానికి గుడిసెలో కట్టెల పొయ్యి వెలిగించింది. మంట పెట్టి బయటకు వెళ్లింది. 11 గంటల సమయంలో అకస్మాత్తుగా గుడిసెకు మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఉమ, వెంకటేష్ గుడిసెలకు కూడా వ్యాపించాయి. అదే ప్రాంతంలోని సీజన్స్ ఆస్పత్రి వైద్య సిబ్బంది మంటలను కొంత అదుపు చేశారు. మలక్‌పేట ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. సాయమ్మ గుడిసెలోని రూ. 5 వేల నగదుతో పాటు, సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. దాదాపు లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు.
హైదర్‌గూడ బిర్యానీ సెంటర్లో..
హైదర్‌గూడలోని కేఫ్ బహార్ బిర్యానీ సెంటర్లో బుధవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. సాయంత్రం 6 గంటల సమయంలో కిచెన్‌లో ఉన్న పొగ గొట్టం (చిమ్ని)లో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన కిచెన్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. హోటల్ యాజమాన్యం సమాచారం మేరకు ఫైర్ సిబ్బందికి అక్కడకు చేరుకుని పది నిమిషాల్లో మంటలను అదుపు చేశారు.
అగ్ని కీలల్లో.. గతంలో జరిగిన ప్రమాదాలు
షార్ట్ సర్క్యూట్, నిర్లక్ష్యం, గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇలా పలు కారణాలతో నగరంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ప్రముఖమైనవి..
- 2002లో బేగంబజార్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో కొందరు పై అంతస్తులోని లాడ్జిలో బస చేస్తున్నవారు.
- 2006లో మీనా జువెలర్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
- 2010లో సోమాజిగూడ పార్క్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు..
- పుప్పాలగూడ బాబా నివా్‌సలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
- ఎల్బీనగర్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
- 2019 అక్టోబర్ 10న వనస్థలిపురం ఇందిరా కాలనీలో టైర్లగోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. వేలాది టైర్లు తగలబడటంతో ఆర్పేందుకు భవనాన్ని కూల్చేయాల్సి వచ్చింది.
- 2020 మార్చి 29న బోయినపల్లి బాపూజీనగర్‌లో 20 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గుడిసెల్లో ఉన్న 13 గ్యాస్ సిలిండర్లు గాలిలోకి లేచి పేలిపోయాయి. దారిన పోతున్న వ్యక్తి సిగరెట్‌ను పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
- ప్రాణనష్టం లేకపోయినా భారీ, స్వల్ప ఆస్తి నష్టం సంభవించిన అగ్నిప్రమాదాలు లెక్కకు మించి చోటుచేసుకున్నాయి.
ఇరవై ఏళ్లకే..
నా తమ్ముడికి 20 సంవత్సరాలే. భార్య, ఒక పాప ఉన్నారు. ఇటీవలే బతుకుదెరువు కోసం బిహార్ నుంచి నగరానికి వచ్చి టింబర్ డిపోలో పనిచేస్తూ కుటుంబానికి డబ్బు పంపుతున్నాడు. తమ్ముడు మృతి తట్టుకోలేకపోతున్నా. - మనీష్‌కుమార్, (మృతుడు సింటూ అన్నయ్య)
పొట్ట కూటి కోసం వస్తే..
బిహార్ నుంచి వేల మంది బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చాం. అక్కడక్కడ పనిచేసుకుంటూ జీవిస్తున్నాం. బోయిగూడ ఘటనతో భయమేస్తోంది. అక్కడ చనిపోయిన వారందరూ బిహార్ వాసులే. - బంటి, కార్మికుడు
వాళ్లు పడుకోవడానికి వచ్చారట..!
తెల్లవారుజామున 3.30కు డాడీకి ఫోన్ వచ్చింది. గోదాం తగులబడుతుందని చెప్పారు. డాడీతో కలిసి వచ్చాం. అప్పటికే మంటలు, పొగ వ్యాపించాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. అందులో కార్మికులున్నారని డాడీ ఆందోళన చెందారు. 11 మంది చనిపోయారని తెలిసి డాడీకి బీపీ డౌన్ అయ్యింది. స్పృహ తప్పి పడిపోయారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గోదాంలోని ఆటోకు, డీసీఎంకు ఇద్దరూ డ్రైవర్లున్నారు. మరో నలుగురు కార్మికులు ఇక్కడివారే. అట్టలు, ప్లాస్టిక్, సీసాలు వేరు చేస్తారు. చనిపోయిన 11 మంది కార్మికులు మా దగ్గర పని చేయరు. గోదాంలో ఏడెనిమిది మంది బిహార్ కార్మికులే పని చేస్తారు. మిగతా కార్మికులు రాత్రి సమయంలో పడుకోవడానికి వచ్చారట. - శ్రవణ్, గోదాం నిర్వాహకుడు సంపత్ కుమారుడు.
కాలిన గాయాలతో ఇద్దరు మృతి
గ్యాస్ లీకేజీతో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. సీఐ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న నేరేడ్మెట్ వినాయకనగర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వంట చేసుకోవడానికి మినీ గ్యాస్ సిలిండర్‌ను వెలిగించారు. అప్పటికే గ్యాస్ లీకవుతుండడంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న కిషన్ సింగ్, కర్మోజ్, నసీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురిలో కిషన్‌సింగ్ (34), నజీర్ (22) బుధవారం మృతి చెందారు.
ఇవి కూడా చదవండి
ఫ్యాన్ల కంపెనీలో అగ్ని ప్రమాదం
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి చెన్నారెడ్డినగర్లోని ఫ్యాన్ల కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ. నాలుగు లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్ని మాపక అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నారెడ్డినగర్‌కు చెందిన యాష్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ల కంపెనీలో ఫ్యాన్ల వైండింగ్ కేబుల్‌తో పాటు తయారీకి వినియోగించే థిన్నర్ కూడా పెద్ద మొత్తంలో స్టోర్ చేసి ఉంచుతారు. బుధవారం ఉదయం పనిలో నిమగ్నమైన కార్మికులు చిమ్నీ గొట్టం నుంచి వైర్లు కాలిన వాసనతో పాటు మంటలు రావడం గమనించారు. దీంతో బయటకు పరుగులు తీశారు. అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు.