Abn logo
Nov 24 2021 @ 11:14AM

HYD : తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భారీ శబ్ధం.. ఏం జరిగిందా అని బయటికొచ్చి చూసే సరికి.. ఒక్కటే ఏడుపులు..

  • గ్యాస్‌ లీకై ప్రమాదం
  • నానక్‌రామ్‌గూడలో కలకలం 
  • ధ్వంసమైన మూడంతస్తుల భవనం
  • 11 మందికి గాయాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం : సమయం తెల్లవారుజామున 4:30. ఇళ్లలోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధం. చుట్టుపక్కల కిలోమీటర్‌ మేర ఇళ్లలోని జనం ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందా అని బయటకు వచ్చారు. సమీపంలోని ఓ భవనంలో హాహాకారాలు, ఏడుపులు వినిపిస్తున్నాయి. దగ్గరికెళ్లి చూస్తే మూడంతస్థుల భవనం పూర్తి దెబ్బతింది. గదుల్లోని గోడలు కూలిపోయాయి. ఇటుకలు మీదపడి ఇంట్లో ఉన్న యువకులకు గాయాలయ్యాయి.  భవనమంతా పొగ, దుమ్ము. ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఎక్కడ భవనం కూలిపోతుందోనన్న భయం. అయినా కొందరు సాహసించి శిథిలాల కింద ఉన్నవారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి భవనాన్ని ఖాళీ చేయించారు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు సృష్టించిన భయానకం ఇదంతా. మంగళవారం తెల్లవారుజామున నానక్‌రామ్‌గూడలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కార్మికులు నగరానికి వచ్చి ఎలక్ట్రికల్‌, ఫైర్‌ సేఫ్టీ, ఇతర భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలోని ఓ భవనంలో అద్దెకు ఉంటూ, షిఫ్టుల వారీగా పని చేస్తున్నారు. ఒక్కో గదిలో ఏడు నుంచి పది మంది వరకు ఉంటున్నారు. మూడు అంతస్థుల్లోనూ మొత్తం 70 మంది వరకు ఉంటారు. వంట చేసుకోవడానికి ఎవరికి వారు కమర్షియల్‌ సిలిండర్లు వాడుతున్నారు.

సిలిండర్‌ లీకై.. మూడో అంతస్తు వరకు..

సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. భవనం లోపలి నుంచి మెట్లకు ఏర్పాటు చేసిన ఐరన్‌ రాడ్‌కు ఉన్న రంధ్రం గుండా లీకైన గ్యాస్‌ మూడు అంతస్థు వరకు పాకింది. తెల్లవారుజామున రెండో అంతస్థులో ఉన్న ఓ కార్మికుడు లేచి బాత్‌రూమ్‌కు వెళ్లడానికి లైట్‌ వేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గ్యాస్‌ మూడు అంతస్థులకు చేరడం, పైగా కమర్షియల్‌ సిలిండర్లు కావడంతో బిల్డింగ్‌ మొత్తం కదిలిపోయింది. గదుల మధ్య ఉన్న గోడలు కూలిపోయాయి. 20 ఏళ్ల కింద కట్టిన భవనం కావడంతో అధికంగా ధ్వంసమైంది. ఇటుక పెళ్లలు మీదపడంతో యువకులను గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి భవనం కింద పార్కు చేసిన ఆటో పది అడుగుల దూరం ఎగిరిపడింది. ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలోని అద్దాలు కూడా పగిలిపోయాయి. 


అందరూ ఇతర రాష్ట్రాలవారే..

ప్రమాదంలో ఎలక్ర్టికల్‌ కాంట్రాక్టర్‌ సులేమాన్‌ అజీజ్‌ ముజావర్‌(47), ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ కమలేష్‌ (24), ఎలక్ర్టీషియన్లు నస్రీఆలమ్‌(42), దబ్లూ యాదవ్‌ (24)లకు పది నుంచి 15 శాతం గాయాలయ్యాయి. యూపీకి చెందిన ఎలక్ర్టీషియన్‌ మెరాజ్‌ ఖాన్‌ (33) 70 శాతం కాలిన గాయాలతో పాటు ఎడమ కాలు విరిగింది. ఎలక్ర్టీషియన్‌లు రాజేంద్రకుమార్‌ సరోజ్‌ (26), మహ్మద్‌ రిజ్వాన్‌(24)కు 30 శాతం గాయాలయ్యాయి. ఫైర్‌ అలారం టెక్నీషియన్‌ ఫర్వేజ్‌ ఆలమ్‌(24) కుడికాలికి తీవ్రగాయమైంది. వీరందరూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లేబర్‌ పనిచేసే వినయ్‌ పటేల్‌ (26) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సునీల్‌, అఫ్జల్‌ చికిత్స పొందుతున్నారు. మొదటి అంతస్తులోని స్లాబ్‌ కదిలిపోవడంతో గోడలు కుప్పకూలాయి. మరో ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

అధికారుల పరిశీలన..

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్ని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆధారాలను సేకరించారు. సిలిండర్‌ నుంచి గ్యాస్‌ ఇంకా లీక్‌ అవుతున్నట్లు గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది లేకేజీని ఆపారు. ఒక సిలిండర్‌ నుంచి మూడు స్టౌవ్‌లకు పైప్‌లైన్‌ కనెక్షలు ఇవ్వటం, గ్యాస్‌ పైపులు కాకుండా, డీజిల్‌ కోసం వినియోగించే పైపులను వాడడంతో గ్యాస్‌ లీకై ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

చుట్టుపక్కల వారు కాపాడారు..

మేం పై అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్‌ గోడలు పగిలి మీదపడటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాం. అసలేం జరిగిందో అర్థం కాలేదు. చుట్టుపక్కల వారు వచ్చి మమ్మల్ని కాపాడారు. - ఎండీ ఆయాస్‌, యూపీ

భయంతో కేకలు..

నిద్రించి ఉండగా, భారీ శబ్దం వచ్చింది. భయంతో కేకలు వేశాను. అందరం ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాం. చుట్టుపక్కల వారి సాయంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. - ఎండీ సయ్యద్‌

ఆటో ఎగిరి పడింది..

నేను ఇంట్లో ఉన్నాను. ఒక్కసారిగా భారీ శబ్దంతో పాటు రాళ్లు ఎగిరి వచ్చి పడ్డాయి. బయటకు వచ్చి చూసేసరికి మొత్తం పొగకమ్మి ఉంది. పేలుడు ధాటికి ఆ భవనం ధ్వంసమైంది. ఆటో అయితే దూరంగా వెళ్లిపడింది. బిల్డింగ్‌లో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నించాం. - వరుణ్‌, స్థానికుడు


హైదరాబాద్మరిన్ని...