18 నామినేషన్లు.. TRS నుంచి 11.. ఎంఐఎం 7.. పోటీకి దూరంగా BJP, Congress!

ABN , First Publish Date - 2021-11-12T17:45:57+05:30 IST

18 నామినేషన్లు.. TRS నుంచి 11.. ఎంఐఎం 7.. పోటీకి దూరంగా BJP, Congress!

18 నామినేషన్లు.. TRS నుంచి 11.. ఎంఐఎం 7.. పోటీకి దూరంగా BJP, Congress!

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన గురువారం 12 మంది కార్పొరేటర్లు నామినేషన్‌ వేశారు. అంతకుముందు ఆరు నామినేషన్లు వేయగా.. మొత్తం సంఖ్య 18కి చేరింది. స్టాండింగ్‌ కమిటీలో 15 మంది సభ్యులకే అవకాశముంది. 20వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్‌ జరుగనుంది. అనంతరం అదే రోజు లెక్కింపు ఉంటుంది. 47 మంది కార్పొరేటర్ల బలమున్న బీజేపీ, ముగ్గురు సభ్యులున్న కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి.


టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిపి..

స్టాండింగ్‌ కమిటీ సభ్యులను అధికార టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పంచుకోనున్నాయి. పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌ నుంచి ఎనిమిది, ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. గత పాలకమండలి (2016- 2021) హయాంలో టీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది, ఎంఐఎం నుంచి ఆరుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 99 నుంచి 56కు పడిపోవడం.. ఎంఐఎం విజ్ఞప్తి నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఏడుగురికి అవకాశమిస్తున్నట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం ఎంఐఎం నుంచి నిర్ణీత సంఖ్యకు అనుగుణంగా ఏడు నామినేషన్లు దాఖలు కాగా, ఎనిమిది మందికే అవకాశమున్న టీఆర్‌ఎస్‌ నుంచి 11 మంది నామినేషన్‌ వేశారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుంది..? నామినేషన్‌ ఉపసంహరించుకునేది ఎవరు..? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి ఎనిమిది మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎవరన్నది టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. నామినేషన్‌ వేయాలని వారికి సూచించినట్టు సమాచారం.


ఏకగ్రీవమా.. ఎన్నికా..?

పార్టీ నుంచి సంకేతాలు రాని వాళ్లు సైతం నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేల సూచనతో పలు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు నామినేషన్‌ దాఖలు చేశారని చెబుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి అవకాశం దక్కేలా చూస్తామని కొందరు శాసనసభ్యులు తమ పరిధిలోని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారని సమాచారం. దీంతో మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన వారూ నామినేషన్లు వేశారు. ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది మాత్రం కేటీఆర్‌ నిర్ణయించనున్నారు. 15వ తేదీ వరకు నామి నేషన్ల ఉపసంహరణకు అవకాశమున్న దృష్ట్యా.. ఆ లోపు ముగ్గురికి సర్ధిచెప్పి ఒప్పిస్తారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. అదే జరిగి నామి నేషన్లు ఉపసంహరించుకున్న పక్షంలో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్డాండింగ్‌ కమిటీ సభ్యుల పదవీ కాలం ఎన్నికైన రోజు నుంచి యేడాది పాటు ఉంటుంది. అనంతరం మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. 


టీఆర్‌ఎస్‌ :-

- పన్నాల దేవేందర్‌రెడ్డి 

- సీఎన్‌ రెడ్డి 

- సామల హేమ

- వి. జగదీశ్వర్‌గౌడ్‌ 

- రాగం నాగేందర్‌యాదవ్‌ 

- మందడి శ్రీనివాసరావు 

- కుర్మ హేమలత 

- ఈ. విజయ్‌కుమార్‌గౌడ్‌ 

- రావుల శేషగిరి

- వనం సంగీతాయాదవ్‌ ఫ వై. ప్రేమ్‌కుమార్‌


ఎంఐఎం :-

మహమ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌

- పర్వీన్‌ సుల్తానా 

- మందగిరి స్వామి 

- మహ్మద్‌ రషీద్‌ 

- రాజుద్దీన్‌ 

- బాత జబీన్‌

- మహాపర 

- మీర్జా ముస్తఫా బేగ్‌



Updated Date - 2021-11-12T17:45:57+05:30 IST