పరీక్షకు వేళాయే..

ABN , First Publish Date - 2022-04-27T06:43:40+05:30 IST

రెండు సంవత్సరాల తరువాత పదో తరగ తి పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి.

పరీక్షకు వేళాయే..

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

మూడు జిల్లాల పరిధిలో 364 పరీక్ష కేంద్రాలు

55,257 మంది విద్యార్థులు.. 2,900 మంది ఇన్విజిలేటర్లు


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : రెండు సంవత్సరాల తరువాత పదో తరగ తి పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు, ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల పరధిలో టెన్త్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. గడిచిన రెండు సంవత్సరాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో పరీక్షల నిర్వహణకుఅవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది వైరస్‌ ప్రభావం తగ్గడంతో అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లాకు ప్రశ్నపత్రాలు చేరుకోగా, వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. 


55,257 మంది విద్యార్థులు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలు, ఏలూరు జిల్లా పరిధిలోని కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని 1,133 ఉన్నత పాఠశాలల నుంచి 55,257 మంది విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. కృష్ణాజిల్లాలో 441 ఉన్నత పాఠశాలలు ఉండగా, 147 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20,370 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 568 ఉన్నత పాఠశాలల నుంచి 28,680 మంది విద్యార్థులు, ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో 124 ఉన్నత పాఠశాలల నుంచి 6,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడు జిల్లాల పరిధిలో 364 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 364 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 364 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, 2,900 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా తె లిపారు. ఏ పాఠశాలకూ అనుబంధంగా లేని 52 సి పరీక్ష  కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరవేసి, జవాబు పత్రాలు తీసుకువచ్చేందుకు 52 మంది కస్టోడియన్‌లను నియమించారు.  కృష్ణాజిల్లాలో ఏడు, ఎన్టీఆర్‌ జిల్లాలో ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. 


బస్సుల్లో ఉచిత ప్రయాణం 

పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. బస్‌పాస్‌ లేని విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపి పరీక్షాకేంద్రం వరకు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని నియమించామని చెప్పారు. ఆలస్యంగా వస్తే అనుమతించకూడదనే నిబంధనలు లేవని తెలిపారు. 

Updated Date - 2022-04-27T06:43:40+05:30 IST