ఆస్పత్రికి తరలింపుపై 108 సిబ్బంది మధ్య వాగ్వాదం.. చివరికి..

ABN , First Publish Date - 2020-08-06T20:13:21+05:30 IST

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాము కాటుకు గురైన ఓ వృద్ధురాలిని..

ఆస్పత్రికి తరలింపుపై 108 సిబ్బంది మధ్య వాగ్వాదం.. చివరికి..

నిర్లక్ష్యం చంపేసింది 

పాముకాటుకు గురైన వృద్ధురాలు

ఆలస్యంగా తీసుకెళ్లడంతో మార్గమధ్యలో మృతి


ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాము కాటుకు గురైన ఓ వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించే విషయంలో 108 సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కారణంగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. దీంతో మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్ర గ్రామానికి చెందిన సాడి తులసమ్మ(65)కు బుధవారం ఉదయం 7 గంటల సమయంలో నాగుపాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేశారు. రెండు గంటల తరువాత కవిటి నుంచి వచ్చిన 108 వాహనంలో తులసమ్మను ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు తమ్మినేని పాపినాయుడు చికిత్స అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.


అప్పటికే అక్కడ ఇచ్ఛాపురానికి చెందిన 108 వాహనం ఉంది. దీంతో కవిటి 108 సిబ్బంది ఇచ్ఛాపురం వాహన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మీ వాహనం ఉంటుండగా, తమనెందుకు ముచ్చింద్ర పంపించారంటూ ప్రశ్నించారు. తులసమ్మను నిర్లక్ష్యంగా వదిలేసి వీరు వాదోపవాదనలు చేసుకున్నారు. చివరకు 45 నిమిషాల అనంతరం కవిటి 108 వాహనంలోనే శ్రీకాకుళం తీసుకెళ్తుండగా, సోంపేట సమీపంలో తులసమ్మ మృతిచెందింది. తిరిగి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తులసమ్మ మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు సీహెచ్‌సీ ఎదుట ఆందోళనకు దిగారు. మూడు గంటలు ఆలస్యం కావడం వల్లే తులసమ్మ మృతి చెందిందని  జనసేన నాయకుడు దుర్యోధనరెడ్డి ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. తులసమ్మకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. కుమారుడు నీలయ్యరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.


మెజిస్టీరియల్‌ విచారణకు కలెక్టర్‌ ఆదేశం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: తులసమ్మ మృతిపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్‌ నివాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పాము కాటుకు గురైన తులసమ్మను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపుపై ఇచ్ఛాపురం, కవిటికి చెందిన 108 వాహన సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కారణంగా మూడు గంటల పాటు తులసమ్మకు వైద్యం అందలేదు. దీంతో ఆమె మృతి చెందింది. 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తులసమ్మ మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై  విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఇచ్ఛాపురం తహసీల్దార్‌, ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.


Updated Date - 2020-08-06T20:13:21+05:30 IST