108 కుయ్యో..మొర్రో

ABN , First Publish Date - 2021-08-04T04:53:45+05:30 IST

అసలే కరోనా కాలం. ఊపిరి బిగ బట్టి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

108 కుయ్యో..మొర్రో
తాడేపల్లిగూడెంలో నిరసన తెలుపుతున్న 108 సిబ్బంది

మూడు నెలలుగా  సిబ్బందికి వేతనాల్లేవ్‌

కరోనా వేళ శానిటైజర్‌ సామాగ్రి కరువే 

వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులు

స్పందించని ప్రభుత్వం 


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

అసలే కరోనా కాలం. ఊపిరి బిగ బట్టి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా కనికరం లేదు. ఒక్క ఫోన్‌కాల్‌తో కుయ్‌..కుయ్‌ మంటూ వాలే 108 మంది సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ఊరూరా తిరిగి రోగులకు వైద్య సేవలందించే 104 వాహన సిబ్బందిదీ అదే పరిస్థితి. జిల్లాలో 400 మంది సిబ్బందికి మూడు నెలల నుంచి వేత నాలు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహిస్తూనే వారం రోజు లుగా సిబ్బంది వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 

108, 104 సిబ్బందికి మూడు నెలలుగా సంబంధిత ఏజన్సీ వేతనాలు ఇవ్వలేకపోతోంది.  ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఏజన్సీ కూడా చేతులెత్తేస్తోందని సిబ్బంది వాపోతున్నారు.మరోవైపు వేతనాలు పెంచనున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు  హామీని నెరవేర్చకపోవడంపై 108, 104 సిబ్బందిలో అసంతృప్తి గూడుకట్టుకుంది. నాలుగు రోజులు క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తే ఒక రోజు ఆఫ్‌ ఉంటుంది. సిబ్బంది కొరతతో ఆఫ్‌లు కూడా ఉండడం లేదంటూ 108 సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ ఉంది. ఒక్కో అంబులెన్స్‌కు ఐదుగురు చొప్పున విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఒక్క 108 వాహనాలకు సంబంధించి 250 మంది సిబ్బంది ఉండాలి. ఇప్పుడు గరిష్టంగా 220 మంది సేవలందిస్తున్నారు. దాంతో ఆఫ్‌లు లభ్యం కావడం లేదంటూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు కరోనా సమయంలోనూ  బాధితులను ఆసుపత్రులకు చేరుస్తునారు.   అయితే సిబ్బందికి సరిపడా గ్లౌజ్‌లు, మాస్క్‌లు  ఏజన్సీ పంపిణీ చేయాలి. అరకొరగానే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. దాంతో సొంత పెట్టుబడితో కొనుగోలు చేసుకుంటున్నారు. 


 లక్ష్యం చేరుకోవాల్సిందే..


ప్రభుత్వం ఇప్పుడు 108 వాహనాల సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతి నెలా ఒక్కో వాహన సిబ్బంది 120 కేసులు చూడాల్సి ఉంటుంది. అంటే రోజుకు నాలుగు కేసులను తప్పనిసరి చేశారు. ఒకరోజు తక్కువైనా సరే నెలకు సరిపడా కేసులు చేయకపోతే అధికారుల నుంచి చీవాట్లు ఎదురవుతున్నాయి. కరోనా సమయంలో జాగ్రత్తలు పాటిస్తూనే లక్ష్యాన్ని చేరుకోవడానికి  సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. గర్భిణులు, క్షతగాత్రులు, హృద్రోగులు ఇలా ఎవరినైనా సకాలంలో ఆసుపత్రులకు చేరుస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే వేతనాలు సకాలంలో అందక పోవడంతో కుటుంబ పోషణ దుర్భరంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు. సిబ్బందికి మూడు కేటగిరీల్లో వేతనాలు ఇస్తున్నారు. పదేళ్లు అనుభవం ఉన్న డ్రైవర్‌లకు రూ. 26 వేలు, వైద్య సిబ్బందికి రూ. 25 వేలు చేతికందుతోంది. కొత్తగా విధుల్లో చేరిన సిబ్బందికి నెలకు రూ. 18 వేలు ఇస్తున్నారు. ఏజన్సీ నిర్వాహకులు మాత్రం ప్రతి నెలా మొదటి వారంలో వేతనాలు వేసేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఆగస్టులోనూ అదే మాదిరిగా వాగ్దానాలు చేశారు. అది వాస్తవ రూపం దాలిస్తే కొద్ది రోజుల్లో వేతనాలకు నోచుకుంటారు. 



Updated Date - 2021-08-04T04:53:45+05:30 IST