108 సిబ్బంది చేతివాటం.. 2.3 కిలోల బంగారం చోరీ

ABN , First Publish Date - 2021-02-25T08:30:46+05:30 IST

కారు బోల్తాపడి బాదితుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆస్పత్రికి తరలించేందుకు వచ్చిన 108 సిబ్బంది అతడి వద్ద ఉన్న 2.3 కిలోలల బంగారు ఆభరణాల ప్యాకెట్లను గుట్టుగా తమ జేబుల్లో వేసుకున్నారు.

108 సిబ్బంది చేతివాటం.. 2.3 కిలోల బంగారం చోరీ

  • రామగుండం సమీపంలో బోల్తాపడ్డ కారు.. 
  • ముగ్గురు వ్యాపారుల్లో ఇద్దరు దుర్మరణం
  • ఆస్పత్రికి తరలిస్తూ సొత్తు పంచుకున్న సిబ్బంది
  • బంగారమంతా స్వాధీనం.. ఇద్దరి అరెస్టు 

గోదావరిఖని, ఫిబ్రవరి 24: కారు బోల్తాపడి బాదితుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆస్పత్రికి తరలించేందుకు వచ్చిన 108 సిబ్బంది అతడి వద్ద ఉన్న 2.3 కిలోలల బంగారు ఆభరణాల ప్యాకెట్లను గుట్టుగా తమ జేబుల్లో వేసుకున్నారు. కొద్దిసేపటికే బాధితుడు ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని దించేసి మృతుడి వద్ద విలువైన వస్తువులేవీ లేవంటూ చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం కమిషనరేట్‌లో కమిషనర్‌ సత్యనారాయణ ఘటన వివరాలను వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన కొత్త శ్రీనివాసరావు, కొత్త రాంబాబు అనే సోదరులు..  గుండా సంతోష్‌ బంగారం వ్యాపారులు. ఆర్డర్లపై ఆభరణాలను సప్లయ్‌ చేస్తుంటారు. ఈ ముగ్గురు 5.6 కిలోల బంగారు ఆభరణాలను తమ చొక్కాల్లోని లోపలి జేబుల్లో పెట్టుకొని డ్రైవర్‌తో కలిసి కారులో నరసరావుపేట నుంచి బయలుదేరారు. ఈ బంగారాన్ని వారు గోదావరిఖని, మంచిర్యాల తదితర ప్రాంతాల్లోని దుకాణాలకు వారు చేరవేయాల్సి ఉంది. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు, మంగళవారం ఉదయం 5 గంటలకు రామగుండం సమీపంలోని మల్యాలపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కొత్త శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. 


కొన ఊపిరితో ఉన్న కొత్త రాంబాబును కమాన్‌పూర్‌కు చెందిన 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) తాజుద్దీన్‌, డ్రైవర్‌ గుజ్జుల లక్ష్మారెడ్డి.. గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. గుండా సంతో్‌షను గోదావరిఖని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ జేబులో కేజీ బంగారం లభించగా 108 అంబులెన్స్‌ ఈఎంటీ చాందర్‌, డ్రైవర్‌ రాజేందర్‌ ఆ ఆభరణాలను రామగుండం ఎస్‌ఐ శైలజకు అందించారు. మృతుడు కొత్త శ్రీనివాస్‌ వద్ద రామగుండం పోలీసులకు 2.3 కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. అయితే మృతుల సోదరుడు కొత్త నాగేశ్వర్‌రావు మాత్రం తమ వారి వద్ద దాదాపు 5.6 కిలోల బంగారు ఆభరణాలు ఉంటాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటివరకు పోలీసుల వద్దకు 3.3కిలోల బంగారం మాత్రమే చేరడంతో, మిగతా 2.3కిలోల బంగారం కోసం దర్యాప్తు ప్రారంభించారు. కమాన్‌పూర్‌ అంబులెన్స్‌కు చెందిన తాజుద్దీన్‌, గుజ్జుల లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా  అసలు విషయం బయటపడింది. కొన ఊపిరితో ఉన్న కొత్త రాంబాబుకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న సందర్భంలో ఆయన జేబులో రెండు కవర్లలో కనిపించిన 2.3 కిలోల బంగారాన్ని తాజుద్దీన్‌, లక్ష్మారెడ్డి పంచుకున్నారు. అనంతరం రాంబాబు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద దించి వెళ్లిపోయారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సోదరుడు చెప్పినట్లుగా మొత్తంగా 5.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు.  కాగా వ్యాపారుల వద్ద లభించిన రశీదులో ఆరు కిలోలకు పైగా ఆభరణాలు తీసుకెళుతున్నట్లు ఉందని, దీనిపైనా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. తరలిస్తున్న బంగారం ఎంత అనేది తాము పరిశీలించుకున్న తర్వాత  సమగ్ర ఫిర్యాదు చేస్తామని మృతుల సోదరుడు చెప్పాడని వెల్లడించారు. ఒక్క గ్రాము బంగారాన్ని కూడా గల్లంతవ్వకుండా చూస్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-02-25T08:30:46+05:30 IST