Abn logo
Jul 1 2020 @ 02:04AM

డ్రైవర్‌, ఆపరేటర్‌తో 104 సరి!

డాక్టర్‌, టెక్నీషియన్‌ లేకుండా సేవలు

నలుగురు సిబ్బందిని తగ్గించి.. రేటు తగ్గింపు

అరబిందోకి నెలకు 1.80 లక్షలు చెల్లింపు

అయ్యే ఖర్చు 80 వేలకు మించదు!

ప్రతినెలా 6 కోట్ల భారమంటున్న నిపుణులు 

ప్రజలకు తగ్గనున్న వైద్య సేవలు

1058 మంది ఉద్యోగుల భవిష్యత్తు గాల్లో?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వంతో పోల్చితే ఒక్కో 104 వాహనంపై చెల్లింపును రూ.60 వేలు తగ్గించాం!’ ...ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న విషయం! వారు చెప్పని సంగతి మరొకటి ఉంది. అదేమిటంటే... గతంలో ప్రతి 104 వాహనంలో ఒక డాక్టర్‌, నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, డ్రైవర్‌, వాచ్‌మన్‌ మొత్తం ఆరుగురు విధులు నిర్వహించారు. ఒకరకంగా చెప్పాలంటే... ఇది పల్లె సీమలకు కదిలొచ్చే ఆస్పత్రి, పరీక్షా కేంద్రం! మరి ఇప్పుడో... 104 వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్‌, అందులో డేటా ఎంట్రీ  ఆపరేటర్‌ మాత్రమే ఉంటారు. ఈ వాహనాలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం పరిధిలోని పీహెచ్‌సీలో ఉన్న డాక్టరే 104 విధులు నిర్వహించాలి. ఇక... వాహనంలో రోగ నిర్ధారణ పరీక్షల యంత్రాలనూ తగ్గించారు. ఇదీ అసలు విషయం! ఆరోగ్యశాఖ 108 అంబులెన్సుల మాదిరిగానే 104 వాహనాల టెండర్లలోనూ మాయ చేసింది.


అస్మదీయ కంపెనీ తప్ప మరొకరు టెండర్లలో పాల్గొనకుండా ముందుగానే రంగం సిద్ధం చేశారు. టెండర్‌ వేయడానికి మరే కంపెనీ ముందుకు రాకపోవడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అఽధికారులే ఒక కంపెనీతో ఎక్కువ రేట్‌కు కోట్‌ చేసి టెండర్‌ వేయించినట్లు తెలుస్తోంది. చివరిగా మూడోసారి అరబిందో కంపెనీ ఎల్‌1 రావడంతో వారికే కట్టబెట్టారు. 108 వాహనాల తరహాలోనే ఈ టెండర్లకు సంబంధించిన ఒక్క డాక్యుమెంట్‌ కూడా బయటకు రానివ్వలేదు. దీని వెనుక ఏపీఎంఎ్‌సఐడీసీతో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొన్నటి వరకూ వాహనాలు నిర్వహించిన పిరమిల్‌ స్వాస్థ్య మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సంస్థకు వాహనానికి నెలకు రూ.2.40లక్షల వరకూ ప్రభుత్వం చెల్లిచ్చేది. ఇప్పుడు అరబిందో ఫార్మా కంపెనీకి నెలకు రూ.1,80,225 చెల్లించేందుకు సిద్ధమైంది. సర్వీస్‌ ప్రొవైడర్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ప్రస్తుతం ఇచ్చేరేటులో సుమారు రూ.60వేల వరకూ వ్యత్యాసం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.  కానీ... తగ్గించిన సిబ్బందితో మిగిలే ఖర్చుతో పోల్చితే ఈ ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే... డ్రైవర్‌, ఆపరేటర్‌ జీతాలు, డీజిల్‌, వాహన నిర్వహణ, ఇతర ఖర్చులన్నీ కలిపినా రూ.80 వేలకు మించి ఖర్చు కాదు. నెలకు రూ.లక్ష చొప్పున చూసినా 676 వాహనాలకు నెలకు రూ.6.76కోట్లు ఏడాదికి రూ.80కోట్లకు పైగా అప్పనంగా ఇచ్చినట్లేనన్న ఆరోపణలు వస్తున్నాయి. 


ఆ సిబ్బంది పరిస్థితేంటి? 

ప్రస్తుతం 104 వాహనాల్లో సుమారు 2వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు 1,058మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అక్టోబరులో 104 ఉద్యోగులతో సీఎం జగన్‌ చర్చలు జరిపిన సమయంలో అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్దుబాటు చేసి, జీతం రూ.28వేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు పదులసార్లు ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసినా ఉపయోగం లేదు. గతనెలలో ఆరోగ్యశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 104 ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇచ్చారు. కానీ ఈ 1058 మందిలో 5శాతం కూడా ఆ పోస్టులకు ఎంపికయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వైద్యుల నియామకం విషయంలో సర్వీస్‌ ప్రొవైడర్‌కు భారీ వెసులుబాటు ఇచ్చారు. దీని ప్రకారం... ప్రభుత్వం వైద్యుల నియామకం చేపడుతుంది. అందులో కొందరిని పీహెచ్‌సీలకు ఆటాచ్‌ చేస్తుంది. అనంతరం సర్వీస్‌ ప్రొవైడర్‌ తాను నియమించుకున్న వైద్యులను తొలగించుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సర్వీస్‌ ప్రొవైడర్‌పై వైద్యుల వేతన ఖర్చు భారీగా తగ్గిపోతుంది. ఆ భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుంది. 


పద్ధతిగా ‘ఎత్తివేత’

104 వాహనంలో ఇప్పుడు 20 రకాల పరీక్షలు చేస్తామని చెబుతున్నా ఆ స్థాయిలో పరికరాలు కొత్త వాహనాల్లో అందుబాటులో లేవు. ఈ వాహనాల్లో ఎన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలో డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. కానీ జ్యుడీషియల్‌ రివ్యూలో అత్యంత కీలకమైన, ఖరీదైన థైరాయిడ్‌ టెస్ట్‌, మైక్రోస్కోప్‌ ఎగ్జామినేషన్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. అంటే కాంట్రాక్టు సంస్థకు ఖర్చు తగ్గించారన్న మాట!


కరోనా వేళ కోలాహలం!

‘గ్రామానికి సర్పంచ్‌ అయినా దేశానికి ప్రధాని అయినా...  కరోనా నిబంధనలు పాటించాల్సిందే’ అని స్వయానా ప్రధాని మోదీయే తేల్చి చెప్పారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివాటిని నేతలు, పాలక పెద్దలే పాటించడంలేదు! ఈ నేపథ్యంలో... ముఖ్యమంత్రి  జగన్‌ చాన్నాళ్ల తర్వాత పాల్గొననున్న బహిరంగ కార్యక్రమంపై అందరి దృష్టి నెలకొంది. 104, 108 వాహనాలను బుధవారం విజయవాడలో ఆయన అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. కేంద్రం ‘అన్‌లాక్‌-2’ నిబంధనల ప్రకారం రాజకీయ, జనం గుమిగూడే కార్యక్రమాలను నిర్వహించకూడదు. 104, 108 వాహనాల ప్రారంభోత్సవానికి సీఎం, మంత్రులు, అధికారులు, పోలీసులు, అభిమానులు వందలసంఖ్యలోనే హాజరయ్యే అవకాశముంది. వీరంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తారా? చూడాలి మరి!


Advertisement
Advertisement
Advertisement