Abn logo
Oct 19 2020 @ 00:39AM

108, 104 సేవల బలోపేతానికి కృషి

ఆరోగ్యశ్రీ అడిషనల్‌ సీఈవో రాజశేఖర్‌రెడ్డి

పలు ప్రాంతాల్లో సేవల పరిశీలన


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 18 : రాష్ట్ర వ్యాప్తంగా 108, 104 వాహనాల సేవలను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అడిషనల్‌ సీఈవో రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని నెల్లూరు నగరం, వెంకటాచలం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. 108, 104 వైద్య సేవలను, వాహనాల నాణ్యత, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. రోగులకు తక్షణ వైద్య సేవలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి కొత్తగా 108 వాహనాలు 412, 104 వాహనాలు 656 ప్రవేశ పెట్టామని తెలిపారు. గతంలో 1.20 లక్షల మంది జనాభాకు ఒక 108 వాహనం ఉండగా, ప్రస్తుతం 74వేల మందికి ఒక వాహనం అందుబాటులో ఉందని చెప్పారు. ఫోన్‌ చేసిన 15 నుంచి 25 నిమిషాలలోపే అత్యవసర కేసుల వద్దకు వెళ్లటం జరుగుతుందన్నారు. రోజుకు 4వేల మంది అత్యవసర రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 104 వాహనాల ద్వారా కోటిన్నర మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అరబిందో సంస్థ జోనల్‌ మేనేజర్‌ హేమంత్‌కుమార్‌, పవన్‌కుమార్‌, మహమ్మద్‌ రఫీ, విష్టువర్దన్‌, బాలశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement