పది రోజుల్లోలక్ష పైనే

ABN , First Publish Date - 2020-09-07T09:01:48+05:30 IST

దక్షిణ భారత దేశంలో ఏపీ కరోనాకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. రాష్ట్రంలో రోజూ పది వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం

పది రోజుల్లోలక్ష పైనే

  • రోజూ పది వేలకుపైగా కరోనా కేసులు
  • ఆదివారం ఒక్కరోజే 10,794 పాజిటివ్‌లు
  • మరో 70 మందిని బలి తీసుకున్న కరోనా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దక్షిణ భారత దేశంలో ఏపీ కరోనాకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. రాష్ట్రంలో రోజూ పది వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 72,573 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,794 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,98,125కి చేరుకుని.. 5 లక్షల మార్కుకు చేరువైంది. కాగా.. కరోనా మరో 70 ప్రాణాలను బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,417కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ జూలై 15 నుంచి భయంకరంగా విజృంభిస్తోంది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 6 వరకూ 1,26,486 కేసులు వెలుగు చూశాయి. వాటిలో గత 10 రోజుల్లోనే 1,05,035 కేసులు బయటపడ్డాయి. పాజిటివ్‌లతో పాటు మరణాలు కూడా అంతే స్థాయిలో నమోదయ్యాయి. గత పది రోజుల్లో ఏపీలో 703 మంది కరోనాతో మరణించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పది రోజుల్లో లక్ష కేసులు, 700 మందిపైన మృతి చెందిన దాఖలాలు లేవు.


సెప్టెంబరు, అక్టోబరులోనూ కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఆదివారం నమోదైన వాటిలో.. నెల్లూరులో అత్యధికంగా 1,299 కేసులు వెలుగుచూశాయి. తూర్పుగోదావరిలో 1,244, పశ్చిమగోదావరిలో 1,101, ప్రకాశంలో 1,042, చిత్తూరులో 927, కడపలో 904, శ్రీకాకుళంలో 818 కేసులు నమోదయ్యాయి. కాగా.. చిత్తూరులో 9, అనంతపురంలో 8, గుంటూరులో 8, ప్రకాశంలో 8, కడపలో 7, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణాలో 4, కర్నూలులో 4, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.


పిఠాపురం ఎమ్మెల్యే చికిత్స కోసం బెంగళూరుకు..

తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌-19 ఉధృతి తగ్గడం లేదు. తాజాగా 1,244 మందికి కరోనా సోకినట్టు తేలింది. శనివారం కరోనా పాజిటివ్‌ వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడ నుంచి బెంగుళూరులోని తన బంధువుల ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు జిల్లాలో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మార్చి 9న ఒక పాజిటివ్‌ కేసుతో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం 40 వేలకు చేరువయ్యాయి. తాజాగా 1,299 కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో కొత్తగా 1,101 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 42,903కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 818 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా 904 మందికి వైరస్‌ సోకగా.. మరో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 868 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం 593 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 24,006కు చేరింది. కర్నూలు జిల్లాలో మరో నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. కొత్తగా 380 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో మరో 753 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 45,300కు చేరింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 457 మందికి, విశాఖలో 573, చిత్తూరు జిల్లాలో 1,150 మందికి, గుంటూరు జిల్లాలో 703 మందికి పాజిటివ్‌ వచ్చింది.


కరోనాతో చికిత్స పొందుతూ వృద్ధురాలి ఆత్మహత్య

కరోనా సోకడంతో నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు.. ఆస్పత్రిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు మూలాపేట కొండదిబ్బ ప్రాంతంలోని మున్సిపల్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉండే వెంగల్‌ పరమేశ్వరమ్మ (60)కు ఇటీవల కరోనా సోకడంతో  ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరింది. ఏమైందో తెలియదు కానీ.. ఆదివారం తెల్లవారుజామున వార్డులో ఉన్న ఫైర్‌ పైప్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చీరకు వేలాడుతుండటాన్ని గుర్తించిన వార్డులోని రోగులు మృతురాలి కుమారుడు గణే్‌షకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2020-09-07T09:01:48+05:30 IST