Apr 16 2021 @ 23:21PM

షాట్‌ క్యారెక్టర్‌

హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘105 మినిట్స్‌’. దీని ప్రత్యేకత ఏంటంటే... ఏకపాత్రాభినయం! చిత్రంలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. అదీ హన్సికది. మరో ప్రత్యేకత ఏంటంటే... ఎడిటింగ్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ చేసే నిమిషాలు, తెరపై చూపించే నిమిషాలు సమానం అన్నమాట.


‘‘భారతీయ తెరపై తొలిసారి ఎటువంటి ఎడిటింగ్‌ లేకుండా ఒకే పాత్రతో, సింగిల్‌ షాట్‌లో చేస్తున్న చిత్రమిది. ఇదొక ప్రయోగం. హన్సిక విభిన్న పాత్రలో కనిపిస్తారు’’ అని దర్శకుడు రాజు దుస్సా తెలిపారు. ‘‘వాణిజ్య హంగులతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాం’’ అని చిత్రనిర్మాత బొమ్మక్‌ శివ చెప్పారు. ‘‘నా కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అని హన్సిక అన్నారు. ఈ చిత్రానికి దుర్గా కిశోర్‌ ఛాయాగ్రాహకుడు.